ఎప్పటికీ అదే ఉంటుంది: ‘గ్రీన్ లంగ్స్’పై పవన్ కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

‘ఏ దేశమైతే ప్రకృతితో కలిసి ఎదుగుతుందో, ఆ దేశం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ప్రకృతితో పాటు సాధించే అభివృద్ధే శాశ్వతంగా ఉంటుంది’ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు....

ఎప్పటికీ అదే ఉంటుంది: ‘గ్రీన్ లంగ్స్’పై పవన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ‘ఏ దేశమైతే ప్రకృతితో కలిసి ఎదుగుతుందో, ఆ దేశం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ప్రకృతితో పాటు సాధించే అభివృద్ధే శాశ్వతంగా ఉంటుంది’ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. మన వారసత్వం అనేది కేవలం మనం నిర్మించిన కట్టడాలు కాకూడదని, మనం కాపాడిన ప్రకృతి అయి ఉండాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలో కొత్తగా అభివృద్ధి చేసిన 18 నగర వనాలు, ఎకో పార్కులు, కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం ప్రాజెక్టులను బుధవారం మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు.

గ్రీన్ లంగ్స్‌లా నగర వనాలు

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ “నగరాలు, పట్టణాలు శరవేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఈ నగర వనాలు పట్టణాలకు గ్రీన్ లంగ్స్‌లాగా పని చేస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడతాయి. కేంద్ర ప్రభుత్వ ‘నగర వన యోజన’ నిధులతో పాటు స్థానిక నిధులను సమకూర్చుకుంటూ రూ. 36 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును సిద్ధం చేశాం. ఒక్కో నగర వనాన్ని సుమారు 50 హెక్టార్ల విస్తీర్ణంలో, రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మించాం. కొడూరు, కైలాసగిరి, మదనపల్లెలలో ప్రత్యేకంగా ఎర్రచందనం పరిరక్షణ పార్కులను ఏర్పాటు చేశాం. మన ప్రాచీన సంస్కృతి, సంప్రదాయ జ్ఞానాన్ని చాటి చెప్పేలా, జీవవైవిధ్య పరిరక్షణే ధ్యేయంగా నక్షత్ర వనాలు, రాశి వనాలను అభివృద్ధి చేశాం. ఈ పార్కులు కేవలం పచ్చదనాన్ని ఇవ్వడమే కాకుండా, ప్రజల శారీరక, మానసిక ఉల్లాసానికి కేంద్రాలుగా నిలవనున్నాయి. ఇందులో పక్షుల ఆవాసాలు, బోటింగ్, కయాకింగ్, ట్రెకింగ్ పాయింట్లు, యోగా కేంద్రాలు, ఓపెన్ జిమ్‌లు వంటి ఎన్నో ప్రత్యేక ఆకర్షణలను అందుబాటులోకి తీసుకొచ్చాం.’’ అని చెప్పారు.

పచ్చదనాన్ని కాపాడుకుందాం

‘‘కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న ఆధునిక నగరాలలో, అలసిన మనుషులకు ఈ నగర వనాలు ప్రకృతిలోని ప్రశాంతతను పరిచయం చేస్తాయి. ఇవి కేవలం నేటి అవసరాల కోసమే కాదు, రాబోయే తరాల కోసం మనం అందిస్తున్న పచ్చని వారసత్వం. ప్రతి ఒక్కరూ వీటిని కాపాడుకుంటూ, మరింత పచ్చని, పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వాములు కావాలి’’ అని పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు.

Next Story