- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TET Paper leak : టెట్ పేపర్లు ఎక్కడ ప్రింట్ చేశారో తెలియదు.. అంగీకరించిన విద్యాశాఖ మంత్రి!
మహారాష్ట్రలో తీవ్ర దుమారం రేపిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్-2026) పేపర్ లీక్ వ్యవహారంలో మరో షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది.

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్రలో తీవ్ర దుమారం రేపిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్-2026) పేపర్ లీక్ వ్యవహారంలో మరో షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. లీకైన పరీక్షా పత్రాలను అసలు ఎక్కడ ముద్రించారో కూడా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దాదా భూసేకు తెలియదనే విషయం బహిర్గతమైంది. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా తనతో ప్రైవేట్‌గా అంగీకరించినట్లు రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సుధీర్ ముంగంటివార్ వెల్లడించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టెట్ క్వశ్చన్ పేపర్లు ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ప్రింట్ అయినట్లు విద్యాశాఖ అధికారులు కనీసం మంత్రికి కూడా సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. విద్యాశాఖ పనితీరులో ఉన్న తీవ్ర లోపాలకు, సమన్వయ లేమికి ఈ ఘటనే నిదర్శనమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా రాష్ట్రంలో జరిగే అన్ని రకాల పోటీ పరీక్షలపై సమగ్ర సమీక్ష, ఆడిటింగ్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, ఇకపై టెట్ పరీక్షలను ఆన్‌లైన్ ద్వారానే నిర్వహిస్తామని, ప్రశ్నపత్రాలను ఇక్కడే రూపొందిస్తామని మంత్రి తనకు తెలిపినట్లు ముంగంటివార్ పేర్కొన్నారు.
ఆరు లక్షల మంది భవిష్యత్తు..?
గత శనివారం (జూన్ 27) జరగాల్సిన టెట్ పరీక్ష.. థానే జిల్లాలో పేపర్ లీక్ అయినట్లు పోలీసులు గుర్తించడంతో చివరి నిమిషంలో వాయిదా పడింది. దీనివల్ల దాదాపు 6 లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ (SIT).. బీహార్, హర్యానాలకు చెందిన నలుగురు నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసింది. దీని వెనుక అంతర్రాష్ట్ర ముఠా ప్రమేయం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై విపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.






