ఢిల్లీలో కాంగ్రెస్ డకౌట్

by Ajay Maddhiboyina |

ఈ కారణాలన్నీ 2015 నుంచి కొనసాగుతున్నా.. ఇప్పటికీ సరైన పరిష్కారాన్ని కనుగొనడంలో కాంగ్రెస్ విఫలమయ్యింది.

ఢిల్లీలో కాంగ్రెస్ డకౌట్
X

- వరుసగా మూడో సారి గుండు సున్నా

- ఓటమికి కారణాలు ఏంటి?

- దేశ రాజధానిలో పార్టీ పుంజుకోదా?

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడో సారి కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలేదు. 2015, 2020, 2025లో వరుసగా మూడు సున్నాలు సాధించి రాజధానిలో హ్యాట్రిక్ డకౌట్ సాధించింది. గ్రాండ్ ఓల్డ్ పార్టీగా పేరున్న కాంగ్రెస్.. దేశ రాజధానిలో వరుసగా దారుణ పరాజయాలను మూటగట్టుకోవడం పార్టీకి ఇబ్బందిగా మారింది. హర్యానా ఎన్నికల దగ్గర నుంచి ఆప్‌తో ప్రారంభమైన విభేదాలు.. చివరకు ఢిల్లీలో ఆప్‌ను ఓడించే వరకు వచ్చాయి. అయితే ఆప్‌తో పంతానికి పోయిన కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడో సారి ఒక్కసీటు కూడా గెలవలేదు. ఇందుకు పలు కారణాలు కనపడుతున్నాయి. 1998 నుంచి 2013 వరకు 15 ఏళ్ల పాటు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్‌ను అవినీతి వ్యతిరేక ఉద్యమం గద్దెదింపింది. శీలా దీక్షిత్ వంటి బలమైన నాయకురాలు.. లోక్‌పాల్ ఉద్యమం కారణంగా రాజకీయాల్లో కనుమరుగైంది. 2013 ఎన్నికల్లో కేవలం 8 సీట్లు తెచ్చుకున్న తర్వాత కూడా కాంగ్రెస్ మేల్కొనలేదు. ఢిల్లీలో తమ వ్యూహాలను మార్చుకోకుండా, స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేయకుండా నిర్లక్ష్యం చేయడంతో ఆ స్థానాన్ని ఆప్ భర్తీ చేసింది.

ఢిల్లీలో ఆప్ బలపడుతున్న సమయంలో కాంగ్రెస్ ఆ పార్టీని చాలా తక్కువగా అంచనా వేసింది. కాంగ్రెస్‌కు అప్పటి వరకు అండగా ఉన్న మైనార్టీలు, దళితులు, దిగువ మధ్యతరగతి, స్లమ్ ఓటర్లు పూర్తిగా ఆప్ వైపు వెళ్లిపోయారు. 2015లో ఓటమి తర్వాత మరింత దూకుడుగా వ్యవహరించాల్సిన కాంగ్రెస్.. అచేతనంగా ఉండిపోయింది. కాంగ్రెస్‌కు ఢిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా బలమైన స్థానిక నాయకత్వం కరువయ్యింది. కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ తప్ప వేరే బలమైన నాయకుడు కనపడటం లేదు. ఆప్, బీజేపీలకు అర్వింద్ కేజ్రివాల్, నరేంద్ర మోడీ ఉన్నట్లు.. కాంగ్రెస్‌కు ఒక బలమైన నాయకత్వం తప్పక అవసరం. ఢిల్లీలో షీలా దీక్షిత్ మరణించిన తర్వాత కాంగ్రెస్‌ నాయకుల మధ్య గ్యాప్ పెరిగింది. ఆ సమయంలో స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలం అయ్యింది.

ఇక కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వ్యూహాలు కూడా ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలో ఆప్‌తో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్.. ఎనిమిది నెలలు తిరక్కుండానే ఒంటరిగా బరిలోకి దిగింది. ఇది ఓటర్లను తికమక పెట్టడమే కాకుండా, యాంటీ బీజేపీ ఓట్లు చీలడానికి కారణమయ్యింది. ఆప్, బీఎస్పీ, మజ్లిస్‌తో పాటు ఇతర చిన్న పార్టీలు కూడా ఎన్నికల బరిలో నిలవడంతో కాంగ్రెస్ పార్టీ తమ పాత సాంప్రదాయ ఓట్లను ఏకీకృతం చేయడంలో ఇబ్బందులు ఎదుర్కుంది. అంతే కాకుండా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కీలక సమస్యలను గుర్తించి, వాటికి పరిష్కారాలు చూపడంలో విఫలమయ్యింది. ఆప్ తన సంక్షేమ పథకాలను, బీజేపీ స్థిరమైన అభివృద్ధి హామీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాయి. కానీ కాంగ్రెస్ గెలిస్తే ఏం చేస్తుందో ప్రజలకు వివరించడంలో విఫలమయ్యింది.

ఈ కారణాలన్నీ 2015 నుంచి కొనసాగుతున్నా.. ఇప్పటికీ సరైన పరిష్కారాన్ని కనుగొనడంలో కాంగ్రెస్ విఫలమయ్యింది. అందుకే వరుసగా మూడు సార్లు సున్నా సీట్లతో అవమానపడాల్సి వస్తోంది. రాబోయే రోజుల్లో కూడా ఢిల్లీలో కాంగ్రెస్ బలపడటం అంత సులభంగా ఏమీ కనపడటం లేదు. ప్రాంతీయ నాయకత్వాన్ని గుర్తించి, వారిని బలోపేతం చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అధికారం చేజిక్కించుకోవడం కలే అవుతుంది.

Next Story