- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికాతో ట్రేడ్ డీల్.. ఇప్పుడిదే 500 బిలియన్ డాలర్ల ప్రశ్న
అమెరికా - భారత్ ట్రేడ్ డీల్ తో మన ఎగుమతులపై పన్నులు తగ్గనుండగా.. కొన్నింటిపై జీరో ట్యాక్స్ అమలయ్యే ఛాన్సుంది.

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా - భారత్ ట్రేడ్ డీల్ తో మన ఎగుమతులపై పన్నులు తగ్గనుండగా.. కొన్నింటిపై జీరో ట్యాక్స్ అమలయ్యే ఛాన్సుంది. ఈ ట్రేడ్ డీల్ పై ఇరుదేశాలు మార్చిలో సంతకం చేయనున్నారు. దీని తర్వాత 30 ట్రిలియన్ డాలర్ల అమెరికా మార్కెట్ భారత్ చేతికి అందిరానుంది. అనేక వస్తువులు అమెరికాలో చౌకధరలకే లభించనున్నాయి. ఇదంతా ఓకే కానీ.. అమెరికా నుంచి భారత్ ఏం దిగుమతి చేసుకుంటుంది ? ఐదేళ్లలో 500 బిలియన్ డాలర్ల దిగుమతుల్లో ఏమేమి కీలకంగా ఉండనున్నాయన్నది పెద్ద ప్రశ్నగా ఉంది.
అమెరికా నుంచి రాబోయే ఐదేళ్లలో ఏకంగా 500 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకోవాలని భారత్ కృతనిశ్చయంతో ఉంది. అయితే.. ఈ లక్ష్య సాధన కేవలం భారతీయ కంపెనీలు ఇచ్చే ఆర్డర్లపైనే కాకుండా, అమెరికన్ సరఫరాదారులు ఆ డిమాండ్‌ను ఎంత వేగంగా తీర్చగలరనే అంశంపై కూడా ఆధారపడి ఉంది.
పుంజుకుంటున్న చమురు దిగుమతులు
గత ఆర్థిక సంవత్సరంలో భారత్.. అమెరికా నుంచి 45.5 బిలియన్ డాలర్ల వస్తువులను దిగుమతి చేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లోనే ఈ విలువ దాదాపు 40 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇందులో విశేషం ఏమిటంటే.. మొత్తం దిగుమతుల్లో ఐదో వంతు (సుమారు 11 బిలియన్ డాలర్లు) అమెరికన్ క్రూడ్ ఆయిల్, పెట్రోలియం ఉత్పత్తులే ఉన్నాయి.
గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే చమురు రవాణాలో 35% వృద్ధి నమోదైంది. మరో 2.7 బిలియన్ డాలర్లు బొగ్గు, కోక్ దిగుమతుల ద్వారా సమకూరాయి. రష్యా వంటి ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే చమురుకు బదులుగా అమెరికన్ ఆయిల్ వైపు భారత్ మొగ్గు చూపే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే భారతీయ చమురు సంస్థలు మరింత ఎల్‌ఎన్‌జి (LNG) కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
ఇండోనేషియా స్థానంలో అమెరికా బొగ్గు?
నాణ్యత పరంగా మెరుగ్గా, ధర పరంగా చౌకగా ఉండటంతో ఇండోనేషియా నుండి వచ్చే కోకింగ్ కోల్‌ను తగ్గించి, అమెరికా నుండి దిగుమతులు పెంచే యోచనలో భారత్ ఉంది. ఏడాదికి 100 బిలియన్ డాలర్ల దిగుమతుల స్థాయికి చేరుకోవడానికి మొదటి ఏడాదిలోనే సాధ్యం కాకపోవచ్చు.. కానీ ఆ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి" అని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.
హై-టెక్ ఉత్పత్తులపై కన్ను
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పందిస్తూ.. ఏయే ఉత్పత్తులు దిగుమతి చేసుకోవాలో భారతీయ కొనుగోలుదారులు, అమెరికన్ అమ్మకందారులు నిర్ణయించుకోవాలని సూచించారు. "భారతీయ కొనుగోలుదారులు కాదనలేని ఆఫర్లను అమెరికా సంస్థలు ముందుకు తీసుకురావాలి" అని ఆయన అన్నారు. చిప్స్, సెమీకండక్టర్లు, విమానాలు, విమాన విడిభాగాల వంటి హై-టెక్ ఉత్పత్తులు ఈ 500 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే.. ఈ భారీ దిగుమతులకు కొన్ని ఆటంకాలు కూడా ఉన్నాయి. బోయింగ్ (Boeing) వంటి విమాన తయారీ సంస్థల వద్ద ఇప్పటికే భారీగా ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి, ఇది సరఫరా వేగాన్ని తగ్గించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ చిప్స్‌కు విపరీతమైన డిమాండ్ ఉండటంతో.. భారతీయ కొనుగోలుదారులు కూడా క్యూలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.






