Trump: ఆయన పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్నారు.. పుతిన్ పై ట్రంప్ వ్యాఖ్యలు

by Shamantha N |

ఉక్రెయిన్ పై రష్యా అతిపెద్ద వైమానిక దాడి చేసింది. యుద్ధం మొదలైనప్పటనుంచి చేసిన తొలి అతిపెద్ద దాడి ఇదే. అయితే, ఈ దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ స్పందించారు.

Trump: ఆయన పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్నారు.. పుతిన్ పై ట్రంప్ వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్ పై రష్యా అతిపెద్ద వైమానిక దాడి చేసింది. యుద్ధం మొదలైనప్పటనుంచి చేసిన తొలి అతిపెద్ద దాడి ఇదే. అయితే, ఈ దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ స్పందించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Putin)పై విరుచుకుపడ్డారు. ఆయన పూర్తిగా పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారని తన ట్రూత్‌ సోషల్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ‘‘పుతిన్‌తో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. కానీ కొన్ని సార్లు ఆయనకు ఏం అవుతుందో అర్థం కావట్లేదు. పూర్తిగా పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు. అనవసరంగా మనుషుల ప్రాణాలు తీసుకుంటుంన్నారు. నేను సైనికుల గురించే మాట్లాడట్లేదు. కారణం లేకపోయినా.. ఉక్రెయిన్ లోని సిటీలపై మిస్సైల్స్, డ్రోన్లతో దాడులు చేస్తున్నారు. ఆయన ఉక్రెయిన్‌ (Ukraine)లో కొంత భూభాగాన్ని కాదు.. ఆ దేశం మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఆయన దృష్టిలో అది సరైనదే కావొచ్చు.. కానీ, అది రష్యా (Russia) పతనానికే దారితీస్తుంది’’ అని ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

జెలెన్ స్కీ తీరుపైనా..

మరోవైపు, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీరుపైనా ట్రంప్ విమర్శలు గుప్పించారు. ‘‘జెలెన్‌స్కీ మాట్లాడే విధానం ఆయన దేశానికి మేలు చేసేలా లేదు. ఆయన మాట్లాడే ప్రతి మాటా సమస్యలు సృష్టిస్తోంది. ఇది మంచి పద్ధతి కాదు. ఇకనైనా ఇలాంటి చర్యలు ఆపాలి. మూడేళ్ల క్రితం నేను అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఉంటే.. ఈ యుద్ధం మొదలయ్యేదే కాదు. అసమర్థత, ద్వేషంతో ప్రారంభమైన ఈ యుద్ధాన్ని నేను ఆపేందుకు ప్రయత్నిస్తున్నా’’ అని ట్రంప్ రాసుకొచ్చారు. మరోవైపు, ఉక్రెయిన్‌పై రష్యా ఆదివారం భీకర దాడికి పాల్పడింది. కీవ్‌ సహా పలు నగరాలు లక్ష్యంగా 367 డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించింది. మూడేళ్లుగా జరుగుతున్న యుద్ధంలో ఇదే అతిపెద్ద వైమానిక దాడి అని ఉక్రెయిన్‌ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై జెలెన్‌స్కీ స్పందిస్తూ.. అమెరికా మౌనంగా ఉంటే అది పుతిన్‌ను సమర్థించినట్లే అవుతుందని విమర్శించారు. అయితే, కాల్పుల విరమణ కోసం చర్చలు జరగుతుండగా మాస్కో ఇలాంటి దాడి చేయడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరంగా మారాయి.

Next Story