రాజీనామాకు మమత ససేమీరా.. మరి రాజ్యాంగం ఏం చెబుతోంది?

by Prasad Jukanti |   (  Updated:2026-05-05 13:22:45  IST  )

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత మమతా బెనర్జీ రాజీనామాకు నిరాకరించడంతో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. తదుపరి పరిణామాలు ఆసక్తిగా మారాయి.

రాజీనామాకు మమత ససేమీరా..  మరి రాజ్యాంగం ఏం చెబుతోంది?
X

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని అందువల్ల తాను సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదంటూ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ప్రజా తీర్పు వల్ల కాకుండా కుట్రల కారణంగానే తాము ఓడిపోయామని ఈ కుట్రలో సీఈసీ ఓ విలన్ గా మారిందని అందువల్ల తాను లోక్ భవన్ వెళ్లేది లేదు, సీఎం పదవికి రాజీనామా చేయబోయేది లేదంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మమత చేసిన ఈ వ్యాఖ్యల పట్ల బీజేపీ సీరియస్‍గా రియాక్ట్ అయింది. మమతా బెనర్జీ రాజీనామా చేయకపోతే ఆమెను బర్తరఫ్ చేయాలని అస్సాం సీఎం హిమంత బిస్వశర్మ అన్నారు. బెంగాల్ ఆమెను చాలా కాలంగా సహిస్తోందని అన్నారు. ఇవాళ ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన ఆమెను డిస్మిస్ చేయడమే సరైనా మార్గం అన్నారు. ఇక బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి స్పందిస్తూ మమత వ్యాఖ్యలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామని, రాజ్యాంగంలో అన్ని అంశాలు ప్రస్తావించబడ్డాయన్నారు.

రాజీనామా చేయకపోతే మార్గమేంటి:

రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(1) ప్రకారం ముఖ్యమంత్రి గవర్నర్ ప్రసాదించిన కాలం వరకు పదవికాలంలో ఉంటారు. ఒక వేళ ఎన్నికల్లో మెజారిటీ కోల్పోతే ఆ ప్రభుత్వం నైతికంగా, రాజ్యాంగబద్ధంగా అధికారంలో ఉండే హక్కును కోల్పోతుంది. కానీ ఒక వేళ పాత ముఖ్యమంత్రి స్వచ్ఛందంగా రాజీనామా చేయకపోతే గవర్నర్ ఆ ప్రభుత్వాన్ని బర్తరఫ్ (Dismiss) చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఒకవేళ ఏ పార్టీకి మెజారిటీ రాకపోయినా లేదా పాత ముఖ్యమంత్రి వైదొలగకపోవడం వల్ల రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినా గవర్నర్ కేంద్రానికి నివేదిక పంపి ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని సిఫార్సు చేయవచ్చు. మరి మమత బెనర్జీ విషయంలో ఏం జరగబోతోంది అనేది వేచి చూడాలి.

Next Story