- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation Sindoor: జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాద సంస్థ మాస్టర్ మైండ్ మసూద్ అజహర్ చరిత్ర ఏంటి..?
peration Sindoor: ఆపరేషన్ సింధూర్ ప్రస్తుతం పాకిస్తాన్ కు కోలుకోలేని దెబ్బతీసింది.

దిశ, వెబ్ డెస్క్: Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ ప్రస్తుతం పాకిస్తాన్ కు కోలుకోలేని దెబ్బతీసింది. ఇప్పటికే ఈ ఆపరేషన్ వల్ల దాదాపు 100 మంది తీవ్రవాదులు హతం అయినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాల పైన ఈ దాడులు జరిగాయి. గగనతల నుంచి క్షిపణులతో చేసిన ఈ దాడులు ఫలితంగా ముజఫరాబాద్ లోని జైషే మహ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల ప్రధాన స్థావరాలు ధ్వంసం అయ్యాయి. ఇక్కడే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులకు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుంటాయి. ఇక్కడే భారత్కు వ్యతిరేకంగా కుట్రలు ఉగ్రదాడులు ప్లాన్ చేస్తుంటారు. అయితే ఈ దాడిలో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ మాస్టర్ మైండ్ మౌలానా మసూద్ అజహర్ మృతి చెంది ఉండవచ్చని వార్తలు సైతం వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ టెర్రర్ మాస్టర్ మైండ్ గురించి ప్రపంచానికి తెలియని కొన్ని విషయాలు తెలుసుకుందాం.
మసూద్ అజహర్ ఈ పేరు గడచిన మూడు దశాబ్దాలుగా తీవ్రవాద శిబిరాల నుంచి గట్టిగా వినిపిస్తున్న పేరు. భారత్ పట్ల నిలువెల్లా విషం నింపుకున్న ఈ మసూద్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం మసూద్ అజహర్ 1968లో పాకిస్థాన్‌లోని బహావల్పూర్ అనే పట్టణంలో జన్మించినట్లు సమాచారం. అతడి విద్యాభ్యాసం అంతా మదర్సాలో జరిగింది. మొదటి నుంచే తర్వాత ఉగ్రవాద భావజాలంతో అతడు ఆకర్షితుడయ్యాడు.
మొదట్లో మసూద్ అజహర్ హర్కతుల్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థలో ప్రవేశించి అక్కడి నుంచి బయటకు వచ్చి 2000 సంవత్సరంలో జైష్-ఎ-మహ్మద్ అనే తన ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. మొదటి నుంచి జమ్మూ కాశ్మీర్ ను అస్థిరపరిచేందుకు అక్కడి యువతను ఉగ్రవాదం వైపు నడిపించేందుకు భారత్లో పెద్ద ఎత్తున దాడి చేసేందుకు కుట్రలు పన్నాడు.
మసూద్ అజహర్ ను 1994లో భారత ప్రభుత్వం అరెస్టు చేసి జైలులో పెట్టింది.అతడు కాశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు గుర్తించి అరెస్ట్ చేసింది. అంతేకాదు అతడికి ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆల్ ఉమర్ ముజాహిదీన్ అనే ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్నట్లు సైతం గుర్తించడంతో పాటు మసూద్ అజహర్ భారత్ లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు వచ్చినట్లు నిఘా వర్గాలు గుర్తించి శ్రీనగర్ లో అరెస్టు చేశాయి. అనంతరం అతడిని హత్య, కుట్ర, టాడా చట్టం కింద అరెస్టు చేసి జమ్మూలోని కోట భల్వాల్ జైలులో ఖైదు చేశారు. అయితే మసూద్ అజహర్ ను విడిపించేందుకు ఉగ్రవాదులు 1999లో భారత విమానం IC-814 హైజాక్ చేశారు. అనంతరం ప్రయాణికుల ప్రాణాలను కాపాడటం కోసం మసూద్ అజహర్, ఉగ్రవాది అహ్మద్ ఓమర్ షేక్, ముస్తాక్ అహ్మద్ జర్గర్లను భారత్ విడుదల చేయాల్సి వచ్చింది.
మసూద్ అజహర్ ప్లాన్ చేసిన ఉగ్రదాడులు ఇవే..
2001 – పార్లమెంట్ దాడి
2008 – శ్రీనగర్ ఫిదాయిన్ దాడులు
2016 – పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ దాడి
2016 – ఉరి దాడి
2019 – పుల్వామా దాడి
ఆపరేషన్ సిందూర్ తర్వాత మౌలానా మసూద్ అజహర్ పరిస్థితి ఏమిటి అన్నది ఎవరికీ తెలీదు. అతడు కొంతకాలంగా పాకిస్తాన్‌లోని బహవల్‌పూర్‌ను స్థావరంగా ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. బహవల్‌పూర్‌లో ఉస్మాన్-ఓ-అలీ క్యాంపస్ అని కూడా పిలువబడే జామియా మసీదు సుభాన్ అల్లాహ్‌లో మసూద్ అజహర్ కు చెందిన జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం ఉంది. 18 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఉగ్రవాద స్థావరంలో ఒక సెంట్రల్ మసీదు, 600 మందికి పైగా విద్యార్థులకు అనువైన మదర్సా, ఒక వ్యాయామశాల, ఈత కొలను గ్రంథాలయం ఉన్నాయి. బహిరంగంగా మతపరమైన కేంద్రంగా ఉన్నప్పటికీ, ఈ క్యాంపస్ 2011 తర్వాత పూర్తి స్థాయి ఉగ్రవాద శిక్షణా కేంద్రంగా రూపాంతరం చెందింది, దీనికి నిధులు జైషే మహ్మద్ ఫ్రంట్ సంస్థ అయిన అల్-రహమత్ ట్రస్ట్ ద్వారా లభిస్తాయి. ఇక్కడే మౌలానా మసూద్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మరి ఈ దాడిలో అతడి పరిస్థితి ఏంటి అన్నది ఇంకా తెలియ రాలేదు.






