బ్రిజ్ భూషణ్‌పై పోక్సో కేసు క్లోజ్.. క్యాన్సిలేషన్ రిపోర్టును అంగీకరించిన కోర్టు

by Phanindra |

డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌పై పెట్టిన పోక్సో కేసు క్లోజ్ అయింది. క్యాన్సిలేషన్ రిపోర్టును కోర్టు అంగీకరించింది.

బ్రిజ్ భూషణ్‌పై పోక్సో కేసు క్లోజ్.. క్యాన్సిలేషన్ రిపోర్టును అంగీకరించిన కోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ నేత, రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్‌కు పటియాలా హౌస్ కోర్టులో ఊరట లభించింది. ఆయనపై పోక్సో చట్టం కింద నమోదైన లైంగిక వేధింపుల కేసును కోర్టు క్లోజ్ చేసింది. ఈ కేసును క్యాన్సిల్ చేస్తూ 2023 జూన్ 15న ఢిల్లీ పోలీసులు ఫైల్ చేసిన రిపోర్టును కోర్టు అంగీకరించింది. డబ్ల్యూఎఫ్ఐ (రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధించాడని పలువురు మహిళా రెజ్లర్లు కేసులు వేసిన సంగతి తెలిసిందే.


వారిలో ఒక మైనర్ బాలిక కూడా ఉంది. ఆమె కేసును పోక్సో చట్టం కింద నమోదు చేయగా.. ఢిల్లీ పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. ఆ తర్వాత సదరు బాధితురాలు, ఆమె తండ్రి ఇచ్చిన స్టేట్‌మెంట్స్ ఆధారంగా కేసును క్యాన్సిల్ చేస్తూ రిపోర్టు ఫైల్ చేశారు. ఈ రిపోర్టుపై పలు ప్రశ్నలు లేవనెత్తిన కోర్టు.. బాధితురాలు నేరుగా కోర్టులో హాజరవ్వాలని ఆదేశించింది. దీనిపై విచారణ అనంతరం సోమవారం నాడు రిపోర్టును అంగీకరిస్తున్నట్లు కోర్టు తీర్పునిచ్చింది.


ఈ విషయాన్ని ప్రకటించిన బ్రిజ్ భూషణ్ కుమారుడు ప్రతీక్ భూషణ్.. తన తండ్రిపై అనవసర ఆరోపణలు చేశారని మండిపడ్డారు. అలాగే మిగతా కేసుల్లో కూడా ఇలాగే తన తండ్రి నిర్దోషిగా బయటపడతారని ధీమా వ్యక్తం చేశారు.

Next Story