Wedding Invitation: వాట్సాప్‌లో ‘పెళ్లి పత్రిక’ మెసేజ్.. క్లిక్ చేయగానే రూ. 5 లక్షలు స్వాహా!

by Ramesh Naini |

వాట్సాప్‌లో వచ్చిన ఓ పెళ్లి పత్రిక (వెడ్డింగ్ కార్డ్) మెసేజ్.. బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారి కొంపముంచింది.

Wedding Invitation: వాట్సాప్‌లో ‘పెళ్లి పత్రిక’ మెసేజ్.. క్లిక్ చేయగానే రూ. 5 లక్షలు స్వాహా!
X

దిశ, డైనమిక్ బ్యూరో: వాట్సాప్‌లో వచ్చిన ఓ పెళ్లి పత్రిక (వెడ్డింగ్ కార్డ్) మెసేజ్.. బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారి కొంపముంచింది. ఆ పత్రికను డౌన్‌లోడ్ చేసుకున్న పాపానికి క్షణాల్లో ఆయన అకౌంట్ నుంచి ఏకంగా రూ. 5 లక్షలు మాయమయ్యాయి. జాతీయ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన నూర్ నహిద్ ఖాన్ (42) అనే వ్యాపారి వాట్సాప్‌ నంబర్‌కు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఓ మెసేజ్ వచ్చింది. ‘మా వివాహానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. వేడుక పూర్తి వివరాల కోసం కింద జతచేసిన ఇన్విటేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి’ అని ఆ మెసేజ్‌లో ఉంది. దానికింద ఓ ఫైల్ కూడా ఉంది. నిజమేనని నమ్మిన ఆయన ఆ మెసేజ్ కింద ఉన్న ‘ఏపీకే (APK)’ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేశాడు. ఆ ఫైల్ డౌన్‌లోడ్ అయిన వెంటనే, ఓ నకిలీ యాప్ ఇన్‌స్టాల్ అయ్యి ఆయన ఫోన్ మొత్తం సైబర్ నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్లిపోయింది. ఆ యాప్ ద్వారా ఫోన్‌లోని గూగుల్ పే, ఇతర బ్యాంకింగ్ యాప్స్, కెమెరా, వ్యక్తిగత సమాచారం మొత్తం హ్యాకర్లకు చిక్కింది. ఫలితంగా, ఏప్రిల్ 16న తెల్లవారుజామున 4:45 నుంచి 4:54 గంటల మధ్యలో ఆయన బ్యాంకు ఖాతా నుంచి పలు యూపీఐ లావాదేవీల ద్వారా రూ.5,00,440 చోరీకి గురయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఐటీ చట్టం (సెక్షన్ 66C, 66D), భారతీయ న్యాయ సంహిత (BNS)-2023 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముఠా నగరంలో చాలా మందికి ఇలాంటి లింకులు పంపి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

నిపుణుల హెచ్చరిక..

సాధారణంగా డిజిటల్ పెళ్లి పత్రికలు ఫొటోలు (JPEG/PNG), వీడియోలు (MP4) లేదా పీడీఎఫ్ (PDF) రూపంలో మాత్రమే వస్తాయి. కానీ ఏపీకే ఫైల్ అనేది ఆండ్రాయిడ్ ఫోన్లలో యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి ఉపయోగించే ఫార్మాట్.. ‘వాట్సాప్‌లో తెలిసినవారు, తెలియనివారు ఎవరు ఏపీకే ఫైల్స్ పంపించినా పొరపాటున కూడా డౌన్‌లోడ్ చేయవద్దు. పెళ్లి పత్రికల ముసుగులో వస్తున్న ఈ కొత్తరకం స్కామ్ పట్ల ప్రజలు డిజిటల్ అవగాహన పెంచుకోవాలి’ అని ప్రముఖ క్రిప్టో సంస్థ ‘కాయిన్‌డీసీఎక్స్’ వ్యవస్థాపకుడు సుమిత్ గుప్తా హెచ్చరించారు.

Next Story