నల్ల దుస్తులు ధరిస్తే.. చీకటి ఒప్పందాలు దాగవు.. కాంగ్రెస్, డీఎంకేలపై ప్రధాని ఫైర్

by Kema Shiva Kumar |

పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్, డీఎంకే పార్టీలపై ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు.

నల్ల దుస్తులు ధరిస్తే.. చీకటి ఒప్పందాలు దాగవు.. కాంగ్రెస్, డీఎంకేలపై ప్రధాని ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా కాంగ్రెస్, డీఎంకే పార్టీలు కలిసి ఈ చారిత్రాత్మక బిల్లుకు మోకాలడ్డడాన్ని తప్పుబట్టారు. బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ కోయంబత్తూరు‌ బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును అడ్డుకోవడం దారుణమని అన్నారు. ఇక ప్రతిపక్ష సభ్యులు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలపడంపై ప్రధాని స్పందించారు. నల్ల దుస్తులు వేసుకున్నంత మాత్రాన మీ చీకటి ఒప్పందాలను, ప్రజా వ్యతిరేక పనులను ప్రజల నుంచి దాచలేరని ఎద్దేవా చేశారు.

వ్యక్తిగత విజ్ఞప్తి చేసినా వినలే..

మహిళల సంక్షేమం కోసం రాజకీయాలకు అతీతంగా ఈ బిల్లును ఆమోదించాలని తాను అన్ని పార్టీల నేతలతో వ్యక్తిగతంగా మాట్లాడానని ప్రధాని మోడీ తెలిపారు. క్రెడిట్ మీరే తీసుకోండి.. కానీ మహిళలకు న్యాయం చేయండి అని కోరినప్పటికీ కాంగ్రెస్, డీఎంకేలు కావాలనే అడ్డుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడులో డీఎంకే నేతలు చేస్తున్న ‘చీకటి పనులు’ అందరికీ తెలుసని, మహిళా రిజర్వేషన్ల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో ఈ నిరసనలతో తేలిపోయిందని అన్నారు. బిల్లును అడ్డుకున్నంత మాత్రాన మహిళా రిజర్వేషన్ల కోసం సాగిస్తున్న పోరాటం ముగియదని, శక్తివంచన లేకుండా కృషి చేస్తామని మోదీ స్పష్టం చేశారు. తెలంగాణ, ఇతర ప్రాంతాల్లో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో మహిళా వ్యతిరేక పార్టీలకు ప్రజలే బుద్ధి చెబుతారని ప్రధాని అన్నారు. ఈ నెల 23న ఓటర్లు కాంగ్రెస్, డీఎంకే కూటమికి తమ ఓటు ద్వారా సరైన సమాధానం చెప్పాలని ప్రధాని పిలుపునిచ్చారు.

Next Story