బంగ్లాదేశ్ చొరబాటుదారులు ఎక్కడున్నా వెనక్కి పంపిస్తాం: అమిత్ షా

by Prasad Jukanti |

చొరబాటు దారుల్ని కాంగ్రెస్ ఓటుబ్యాంకుగా చూస్తోందని అమిత్ షా ఆరోపించారు.

బంగ్లాదేశ్ చొరబాటుదారులు ఎక్కడున్నా వెనక్కి పంపిస్తాం: అమిత్ షా
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా చొరబాటుదారులను తొలగించడానికి భారతీయ జనతా పార్టీ (BJP) కట్టుబడి ఉందని, బంగ్లాదేశ్ చొరబాటుదారులు (Bangladesh Infiltrators) ఎక్కడున్నా పంపించేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) మరోసారి స్పష్టం చేశారు. ఇవాళ అస్సాంలోని బటద్రవ సాంస్కృతిక ప్రాజెక్టును ప్రారంభించిన తర్వాత అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో షా మాట్లాడారు. చొరబాటుదారులను కాంగ్రెస్ (Congress) ఓటు బ్యాంకుగా చూస్తోందని అందుకే కాంగ్రెస్ ఎస్ఐఆర్ ని వ్యతిరేకిస్తోందన్నారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులు ఆక్రమించుకున్న లక్షకు పైగా బిఘాల భూమిని ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం విడిపించిందని, రాష్ట్రంలో పాగా వేసిన చొరబాటుదారులను పూర్తిగా నిర్మూలించడానికి బీజేపీకి మరో అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.

కాంగ్రెస్ చాలా సంవత్సరాలు పాలించినప్పటికీ అస్సాం ఉద్యమం కోసం ప్రాణాలర్పించిన వారికి ఏమీ చేయలేకపోయిందని దుయ్యబట్టారు. గత 11 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని పలు మిలిటెంట్‌ సంస్థలతో శాంతి ఒప్పందాలు చేసుకుందన్నారు. అస్సాం తొలి ముఖ్యమంత్రి, భారత రత్న గోపీనాథ్ బోర్డోలోయ్ లేకుంటే అస్సాం మరియు మొత్తం ఈశాన్య ప్రాంతం భారతదేశంలో భాగం అయ్యేది కాదన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ అస్సాంను భారతదేశంలోనే ఉంచమని బలవంతం చేసిందిగోపీనాథే అని షా గుర్తు చేశారు.

Next Story