శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధనౌకను కూల్చేశాం.. అమెరికా సంచలన ప్రకటన

by Kema Shiva Kumar |

శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధనౌకను అమెరికా సబ్‌మెరైన్ సహాయంతో పేల్చివేసినట్లు ఆ దేశ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ సంచలన ప్రకటన చేశారు.

శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధనౌకను కూల్చేశాం.. అమెరికా సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ అమెరికా రక్షణ శాఖ (Pentagon) కీలక ప్రకటన చేసింది. శ్రీలంక సమీపంలోని హిందూ మహాసముద్రంలో ప్రయాణిస్తున్న ఇరాన్ (Iran) యుద్ధనౌకను తమ సబ్‌మెరైన్ సాయంతో పేల్చివేసినట్లు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ధృవీకరించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఓ శత్రు దేశానికి చెందిన యుద్ధనౌకను అమెరికా సబ్‌మెరైన్ టార్పెడోతో ధ్వంసం చేయడం ఇదే తొలిసారి అని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ నౌకాదళానికి చెందిన అత్యాధునిక ఫ్రిగేట్ ఐరిస్ దేనా (IRIS Dena)‌న అమెరికా నేవీకి చెందిన సబ్‌మెరైన్ నుంచి ప్రయోగించిన టార్పెడో ద్వారా దాడి చేసినట్లుగా పెంటగాన్ ప్రకటించింది. శ్రీలంకలోని గాలే నగరానికి సుమారు 44 నాటికల్ మైళ్ల దూరంలో అంతర్జాతీయ జలాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ సందర్భంగా పెంటగాన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పీట్ హెగ్సెత్ (Pete Hegseth) మాట్లాడుతూ.. అంతర్జాతీయ జలాల్లో తాము సురక్షితంగా ఉన్నామని భావించిన ఇరాన్ యుద్ధనౌకను అమెరికన్ సబ్‌మెరైన్ ముంచివేసిందని అన్నారు. టార్పెడో ద్వారా దాడి చేశామని అన్నారు. శత్రువులకు ఎక్కడా రక్షణ లేదని నిరూపించడమే తమ లక్ష్యమని పీట్ హెగ్సెత్ హెచ్చరించారు.

అయితే, ఇరాన్‌కు చెందిన ఐరిస్ దేనా నౌకలో సుమారు 180 మంది సిబ్బంది ఉన్నట్లుగా సమాచారం. శ్రీలంక (Srilanka) నౌకాదళం చేపట్టిన సహాయక చర్యల్లో ఇప్పటి వరకు 32 మందిని రక్షించగా.. మరో 28 మృతదేహాలను వెలికితీశారు. సుమారు 100 మందికి పైగా సిబ్బంది గల్లంతైనట్లుగా తెలుస్తోంది. ఈ నౌక భారత్‌లోని విశాఖపట్నంలో జరిగిన ‘మిలాన్-2026’ విన్యాసాల్లో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఈ దాడి జరిగినట్లుగా ప్రాథమికంగా సమాచారం అందుతోంది.

Next Story