Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని సంచలన వ్యాఖ్యలు

by Shamantha N |
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై హత్యాయత్నం జరిగందని వెల్లడించారు. త్రుటిలో చావు నుంచి తప్పించుకున్నట్లు చెప్పుకొచ్చారు. అవామీ లీగ్‌ పార్టీ సోషల్ మీడియా అకౌంట్ లోని ఆడియో సందేశంలో ఆమె ఈమేరకు వ్యాఖ్యానించారు. ప్రధాని పదవికి రాజీనామా చేసిన తర్వాత.. తాను, తన సోదరి రెహానా 20-25 నిమిషాల వ్యవధిలో చావు నుంచి తప్పించుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత భారత్‌కు చేరుకున్నామన్నారు. గతంలోనూ పలుమార్లు తనపై జరిగిన హత్యాయత్నాల గురించి హసీనా మాట్లాడారు. ‘2000 ఏడాదిలో కోట్లీపర బాంబు దాడి నుంచి బయటపడ్డాను. 2004 ఆగస్టులోనూ చావు అంచునుంచి బయటపడ్డా. మరోసారి 2024 ఆగస్టు 5న ప్రాణాలు పోకుండా తప్పించుకోగలిగాను. లేకపోతే ఈపాటికే చనిపోయి ఉండేదాన్ని’ అని హసీనా పేర్కొన్నారు. ‘నేను ప్రాణాలతో ఉన్నప్పటికీ.. నా దేశంలో, నా ఇంట్లో ఉండే అవకాశం లేకుండా పోయింది’ అంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

భారత్ లో ఆశ్రయం

ఇకపోతే, గతేడాది అనూహ్యంగా పదవిని కోల్పోయిన బంగ్లాదేశ్‌ (Bangladesh) మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. గతేడాది ఆగస్టులో అవామీ లీగ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో దాదాపు 600 మందికి పైగా మరణించారు. దాంతో ప్రధానిగా ఉన్న షేక్‌హసీనా తన పదవికి రాజీనామా చేశారు. ఈక్రమంలోనే తనపై హత్యాయత్నం జరిగిందని హసీనా పేర్కొన్నారు. అంతేకాకుండా, బంగ్లాదేశ్ నుంచి పారిపోయిన తర్వాత స్వదేశంలో షేక్ హసీనపై అనేక కేసులు నమోదయ్యాయి. అరెస్టు వారెంట్లు కూడా జారీ అయ్యాయి. ఈక్రమంలోనే హసీనాను తమకు అప్పగించాలంటూ గత డిసెంబరులో బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం భారత ప్రభుత్వానికి ఒక దౌత్య సందేశం పంపింది. ఈ విషయంపై ఇరు దేశాల మధ్య చర్చలు కూడా జరుగుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed