- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుక్క ఏ మూడ్‌లో ఉంటుందో ఎవరికి తెలుసు? : విచారణలో సుప్రీం కీలక వ్యాఖ్యలు
వీధి కుక్కలు ఎప్పుడు ఎవరిని కరుస్తాయో, వాటి మూడ్ ఎప్పుడెలా ఉంటుందో ఎవరికి తెలుస్తుందని సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: వీధి కుక్కలు ఎప్పుడు ఎవరిని కరుస్తాయో, వాటి మూడ్ ఎప్పుడెలా ఉంటుందో ఎవరికి తెలుస్తుందని సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీలో వీధికుక్కల్ని షెల్టర్ హోమ్స్ కు తరలించాలని గతంలో ఇచ్చిన ఆదేశాలపై దాఖలైన పిటిషన్ పై నేడు విచారణ చేపట్టింది. ఈ కేసు విచారణలో భాగంగా జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కుక్కల మూడ్ ను ఎవరూ అర్థం చేసుకోలేరని పేర్కొంది. పిటిషనర్ తరపు న్యాయవాది కపిల్ సిబల్ ధర్మాసనానికి తన వాదనలు వినిపించారు. వీధులలో తిరిగే కుక్కలు కరుస్తాయని భావించినపుడు స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. వాళ్లు కుక్కను తీసుకెళ్లి స్టెరిలైజ్ చేసి వదిలిపెడతారని తెలిపారు.
వీధుల్లో కుక్కలు ఉండాల్సిన అవసరం ఏంటి?
ఈ వాదనలపై స్పందించిన ధర్మాసనం.. స్టెరిలైజ్ చేశాక మనుషుల్ని కరవకుండా ఉండేందుకు కుక్కలకు కౌన్సెలింగ్ ఇవ్వాలన్న విషయాన్ని మర్చిపోయినట్లున్నారని వ్యాఖ్యానించింది. మనుషులను కరవడం మాత్రమే కాకుండా వీధుల్లో కుక్కలు పరిగెత్తడం వల్ల వెహికల్ యాక్సిడెంట్లు కూడా జరిగే అవకాశం ఉందని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. ప్రమాదం జరిగాక ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే.. ఆ ప్రమాదం జరగకుండా జాగ్రత్తపడటం మంచిదని అభిప్రాయపడింది. అసలు వీధుల్లో, స్కూళ్లు, ఇతర విద్యాసంస్థలకు సమీపంలో కుక్కలు ఉండాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది.






