black box: బ్లాక్ బాక్స్ ను డీకోడ్ చేస్తున్నాం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

by Shamantha N |

అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం అనంతరం తొలిసారి కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు.

black box: బ్లాక్ బాక్స్ ను డీకోడ్ చేస్తున్నాం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
X

దిశ, నేషనల్ బ్యూరో: అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం అనంతరం తొలిసారి కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదానికి గురైన ప్రాంతం నుంచి బ్లాక్ బాక్స్‌ను వెలికితీశామని దాని డేటాను డీకోడ్ చేస్తున్నట్టు తెలిపారు. పలు ఏజెన్సీలు, ఉన్నతస్థాయి కమిటీలు విస్తృత దర్యాప్తు జరుపుతున్నాయని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడంలో బ్లాక్ బాక్స్ కీలక సమాచారం అందించనుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ (AAIB)ను వెంటనే అప్రమత్తం చేశామన్నారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారం నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో బ్లాక్ బాక్స్‌ను వెలికితీసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.

బ్లాక్ బాక్స్ డీకోడ్ తో ఏం జరిగిందో తెలిసే అవకాశం

బ్లాక్ బాక్స్ డీకోడ్ తో ప్రమాద సమయంలో లేదా దానికి ముందు ఏం జరిగిందో తెలుసుకోవచ్చు. లోతైన సమాచారం లభించే అవకాశం ఉంది. AAIB పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం వచ్చే నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని దుర్ఘటన తర్వాత తీసుకున్న జాగ్రత్తలు, భద్రతా ప్రమాణాలపై మంత్రి మాట్లాడారు. ఈ ఘటన తర్వాత Boeing 787 సిరీస్‌ విమానాలపై విస్తృత నిఘా అవసరమని గుర్తించామన్నారు. మొత్తం 34 బోయింగ్ 787 విమానాల్లో ఇప్పటికే 8 విమానాలను తనిఖీ చేశామని మిగతా వాటిని కూడా తనిఖీ చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా పౌర విమానయాన కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా మాట్లాడుతూ.. ప్రమాదానికి ముందు ఆ ఎయిర్ ఇండియా విమానం ప్యారిస్-ఢిల్లీ-అహ్మదాబాద్ మార్గంలో ఎలాంటి సమస్యలు లేకుండా ప్రయాణించిందని వివరించారు.

Next Story