- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రేమ వేధింపులే కారణమా? హెల్త్ సెంటర్ ముందే నర్సు దారుణ హత్య
పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో, జనం రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక మహిళా నర్సు దారుణ హత్యకు గురవ్వడం మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో భయాందోళనలు సృష్టించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో, జనం రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక మహిళా నర్సు దారుణ హత్యకు గురవ్వడం మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో భయాందోళనలు సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. షాఘర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో (CHC) స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న దీపశిఖ చధర్ (25) బుధవారం రాత్రి తన నైట్ షిఫ్ట్ కోసం ఆస్పత్రికి చేరుకున్నారు. రాత్రి సరిగ్గా 8:30 గంటల సమయంలో దీపశిఖ ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద ఉండగా, ఒక అజ్ఞాత వ్యక్తి ఆమెను అడ్డుకున్నాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. సదరు వ్యక్తి ఆమెను బలంగా కిందకు నెట్టివేసి, తన వద్ద ఉన్న తుపాకీతో మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్ ఆమె వెన్నులోకి దూసుకెళ్లడంతో తీవ్ర రక్తస్రావమై దీపశిఖ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణం జరిగిన ప్రాంతం మెయిన్ బస్టాండ్‌కు సమీపంలో ఉండటమే కాకుండా, పోలీస్ స్టేషన్‌కు కేవలం 200 మీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం. కాల్పుల శబ్దంతో ఒక్కసారిగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నిందితుడు ఘటన అనంతరం వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు.
ప్రేమ వేధింపులే కారణమా?
పోలీసుల ప్రాథమిక విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు జబల్‌పూర్ జిల్లా కటంగి పటాన్ ప్రాంతానికి చెందిన యువకుడిగా గుర్తించారు. అతను గత కొంతకాలంగా దీపశిఖను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఆమె అందుకు నిరాకరించడంతోనే కక్ష పెంచుకుని ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
అటవీ ప్రాంతంలోకి పారిపోయిన నిందితుడు!
ఘటనపై సమాచారం అందిన వెంటనే షాఘర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అదనపు ఎస్పీ సంజీవ్ కుమార్ ఉయికే స్పందిస్తూ.. ‘కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం. నిందితుడు సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పారిపోయినట్లు భావిస్తున్నాం. పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. సీసీటీవీ దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నాం’ అని తెలిపారు. నిందితుడు పొరుగు జిల్లా అయిన ఛతర్‌పూర్‌కు పారిపోయే అవకాశం ఉండటంతో సరిహద్దు జిల్లాల పోలీసులను కూడా అలర్ట్ చేశారు.






