వివాహేతర సంబంధం చిచ్చు.. ఒకరి హత్య, జ్యోతిష్యుడితో సహా ఏడుగురి అరెస్ట్

by Ramesh Naini |   (  Updated:2026-02-05 15:01:40  IST  )

వివాహేతర సంబంధం చిచ్చు.. ఒకరి హత్య, జ్యోతిష్యుడితో సహా ఏడుగురి అరెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తర కన్నడ జిల్లా సిద్దాపుర తాలూకాలోని ఆవరగొప్ప గ్రామంలో చోటుచేసుకున్న వివాహేతర సంబంధం వివాదం ఒకరి ప్రాణాలను బలిగొంది. ఈ హింసాత్మక ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో ఓ జ్యోతిష్యుడు సహా ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆవరగొప్ప గ్రామానికి చెందిన మహేశ్ నాయక్ భార్య సుచిత్రకు, శివమొగ్గలో జ్యోతిష్యుడిగా చెప్పుకునే కమలాకర్ భట్ (గురూజీ)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. కొన్ని నెలల క్రితం సుచిత్ర తన ఇద్దరు కుమార్తెలతో కలిసి భర్తను వదిలి శివమొగ్గలోని కమలాకర్ భట్ నివాసానికి వెళ్లిపోయింది. అయితే, అక్కడ వేధింపులు భరించలేక ఒక కుమార్తె ఫిబ్రవరి 1న తిరిగి తండ్రి మహేశ్ నాయక్ వద్దకు వచ్చేసింది. దీంతో ఆగ్రహానికి గురైన సుచిత్ర, జ్యోతిష్యుడు కమలాకర్ భట్, వారి అనుచరులు సోమవారం రాత్రి ఆవరగొప్పకు చేరుకున్నారు. మహేశ్ నాయక్ సోదరుడు వసంత నాయక్ ఇంటి వద్ద ఆశ్రయం పొందుతున్న కుమార్తెను బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.

కత్తులతో దాడి.. ఒకరి మృతి

ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం పెరిగి ఘర్షణకు దారితీసింది. నిందితులు వెంట తెచ్చుకున్న పదునైన ఆయుధాలతో మహేశ్ నాయక్, వసంత నాయక్, పొరుగున ఉన్న కుమార్ అనే వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వసంత జాత్య నాయక్ (41) ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. మహేశ్ నాయక్, కుమార్ ప్రస్తుతం శివమొగ్గలోని మెగ్గాన్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

పోలీసుల చర్యలు.. ఏడుగురు అరెస్ట్

మృతుడి బంధువు సంధ్యా నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిద్దాపుర పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ దీపక్ ఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన సుచిత్ర నాయక్, లోకనాథ్ నాయక్, జ్యోతిష్యుడు కమలాకర్ భట్, ఆకాష్, మహమ్మద్ ముఫుజ్, ఫైజల, ఇర్ఫాన్లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. భారతీయ న్యాయ సంహిత (BNS) కింద హత్య, హత్యాప్రయత్నం, నేరపూరిత కుట్ర వంటి సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. దాడికి ఉపయోగించిన వాహనాన్ని కూడా పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ప్రేమ వేధింపులే కారణమా? హెల్త్ సెంటర్ ముందే నర్సు దారుణ హత్య

Next Story