దారుణం.. మూగ, చెవుడు విద్యార్థులపై వార్డెన్ లైంగిక వేధింపులు! వెలుగులోకి ఆధారాలు?

by Ramesh Naini |

విద్యాబుద్ధులు నేర్పించి, అండగా నిలవాల్సిన చోటే ఆ విద్యార్థులకు నరకం ఎదురైంది. ఒడిశాలోని కలహండి జిల్లాలో ఉన్న 'రెడ్ క్రాస్ స్కూల్ ఫర్ బ్లైండ్, డెఫ్ అండ్ మ్యూట్' (అంధ, మూగ, చెవుడు పాఠశాల)లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.

దారుణం.. మూగ, చెవుడు విద్యార్థులపై వార్డెన్ లైంగిక వేధింపులు! వెలుగులోకి ఆధారాలు?
X

దిశ, డైనమిక్ బ్యూరో: విద్యాబుద్ధులు నేర్పించి, అండగా నిలవాల్సిన చోటే ఆ విద్యార్థులకు నరకం ఎదురైంది. ఒడిశాలోని కలహండి జిల్లాలో ఉన్న 'రెడ్ క్రాస్ స్కూల్ ఫర్ బ్లైండ్, డెఫ్ అండ్ మ్యూట్' (అంధ, మూగ, చెవుడు పాఠశాల)లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పాఠశాల వార్డెన్ సంధ్యా దర్శన్ మహాపాత్ర తమను శారీరకంగా, లైంగికంగా వేధిస్తున్నాడంటూ పలువురు విద్యార్థిని, విద్యార్థులు ఆరోపించారు. విద్యార్థులు తెలిపిన కథనం ప్రకారం.. సదరు వార్డెన్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, వారిని ఇష్టారాజ్యంగా లాక్కెళ్లడమే కాకుండా అభ్యంతరకర రీతిలో తాకుతున్నాడని బాధితులు వాపోయారు. దీనిని ప్రతిఘటించినా లేదా అధికారులకు ఫిర్యాదు చేసినా, అబ్బాయిలపై తీవ్రస్థాయిలో భౌతిక దాడికి దిగుతూ మానసిక క్షోభకు గురిచేస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. తమకు జరుగుతున్న అన్యాయాన్ని విద్యార్థులు సైగలతో వివరిస్తున్న దృశ్యాలు, వ్రాతపూర్వక ఫిర్యాదులు ఇప్పుడు సంచలనంగా మారాయి.

వీడియో ఆధారాలు వెలుగులోకి..

ఇందకు సంబంధించిన కొన్ని వీడియో దృశ్యాలు బయటకు వచ్చాయి. ఒక వీడియోలో బాలిక ఇబ్బంది పడుతున్నప్పటికీ ఆమె భుజాలు, వీపుపై అసభ్యకరంగా చేతులు వేయడం, మరో చోట చీకటి గదిలో బాలికతో అనుచితంగా ప్రవర్తించడం వంటి దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఘటనపై కలహండి జిల్లా యంత్రాంగం వేగంగా స్పందించింది. జిల్లా బాలల సంరక్షణ అధికారి శైలేందు మహాపాత్ర మాట్లాడుతూ.. కొందరు సిబ్బంది పిల్లలను లైంగికంగా వేధిస్తున్నట్లు మాకు ఫిర్యాదులు అందాయన్నారు. దీనిపై అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ADM-General) నేతృత్వంలో ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రాథమిక విచారణ ఇప్పటికే పూర్తయిందని, పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. నివేదికలో ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

Next Story