Pahalgam Attack: బార్డర్‌లో వార్ టెన్షన్! పహెల్గం ఎటాక్ తర్వాత పాక్ కుయుక్తులు

by Prasad Jukanti |

పహెల్గం ఎటాక్ తర్వాత పాక్ తీరు చర్చనీయాశంగా మారుతోంది.

Pahalgam Attack: బార్డర్‌లో వార్ టెన్షన్!  పహెల్గం ఎటాక్ తర్వాత పాక్ కుయుక్తులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లోని పహెల్గంలో (Pahalgam Attack) పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబాకు ప్రాక్సీ సంస్థ టీఆర్ఎఫ్ (ది రెసిస్టెన్స్ ఫ్రంట్) ఉగ్రవాదులు సృష్టించిన నరమేధంపై భారతీయులు భగ్గుమంటున్నారు. ఈ ఉగ్రదాడికి బాధ్యులైన వారిని వదిలిపెట్టవద్దని దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దాడిని ఈ ప్రపంచ దేశాలు సైతం ఖండిస్తున్నాయి. ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారత భద్రత బలగాలు జమ్మూకశ్మీర్ లోని అన్ని ప్రాంతాలను జల్లెడ పడుతుంటే మరోవైపు పాకిస్తాన్ యుద్ధ సన్నాహాలు చేస్తున్నది. దీంతో భారత్-పాక్ సరిహద్దులో వార్ టెన్షన్ (War tension in Pakistan, India border) నెలకొన్నది. భారత సరిహద్దుల వెంట పాకిస్తాన్ భారీగా సైన్యాన్ని మోహరిస్తోంది. కరాచీలో ఉన్న యుద్ధ విమానాల్లో కొన్నింటిని లాహోర్, రావల్పిండికి, మరికొన్నింటిని కశ్మీర్ సరిహద్దుల వైపు తరలిస్తోంది. పాక్ యుద్ధ విమానాల తరలింపు విషయాలను పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

కేంద్ర కేబినెట్ అత్యవసర సమావేశం!

పాకిస్తాన్ కవ్వింపు (Pakistani provocations) చర్యల నేపథ్యంలో భారత త్రివిధ దళాధిపతులు కశ్మీర్‌లోని పలు ప్రాంతాలు, ఎల్‌వోసీ వద్ద భద్రతా దళాలను అప్రమత్తం చేశారు. ఇప్పటికే రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యారు. మరోవైపు పహెల్గాం ఉగ్రదాడిని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ దాడికి పాల్పడింది పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోక సంస్థ కావడంతో పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాని మోడీ ఉన్నతాధికారులతో భేటీ నిర్వహించగా. ఇవాళ సాయంత్రం 6 గంటలకు కేంద్ర కేబినెట్ అత్యవసర సమావేశం కాబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు కేబినెట్ మంత్రులు అత్యవసరంగా ఢిల్లీకి చేరుకోవాలని పీఎంవో ఆదేశాలు ఇచ్చింది. పాక్ విషయంలో విదేశాల సహకారం, రక్షణ ఆయుధాల అవసరంపై ఈ భేటీలో కీలకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌పై ప్రతీకార చర్యల్లో భాగంగా అందరి దృష్టి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌పైనే అందరి చూపు ఉంది.

మతం టార్గెట్‌గా దాడి: రాజ్‌నాథ్ సింగ్

పహెల్గాం దాడికి అతి త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటామని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Raj Nath Singh) అన్నారు. ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. భారత్‌ను ఎవరూ భయపెట్టలేరని, ప్రపంచం ఆశ్చర్యపోయే రీతిలో త్వరలోనే జవాబిస్తామన్నారు. పహెల్గం దాడి పిరికిపంద చర్య అని, ప్రత్యేకంగా ఒక మతాన్ని లక్ష్యంగా ఈ ఉగ్రదాడి జరిగిందన్నారు. ఉగ్రవాదులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఈ దాడి వెనుక ఎవరు ఉన్న వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కుట్రదారులు ఎక్కడ నక్కినా వెతికి పట్టుకుంటామన్నారు. టెర్రరిజాన్ని తుదముట్టించాలనేది భారత్ విధానమన్నారు.

Next Story