- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Waqf bill: వక్ఫ్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి.. దేశ వ్యాప్త నిరసనకు ముస్లిం సంస్థ పిలుపు
వక్ఫ్ చట్టాన్ని ఉపసంహరించుకునే వరకు దేశ వ్యాప్తంగా నిరసన చేపడతామని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు హెచ్చరించింది.

దిశ, నేషనల్ బ్యూరో: వక్ఫ్ చట్టాన్ని (Waqf act) వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఈ చట్టాన్ని ఉపసంహరించుకునే వరకు దేశ వ్యాప్తంగా నిరసన చేపడతామని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) హెచ్చరించింది. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా అన్ని మత, సామాజిక సంస్థల సమన్వయంతో దేశవ్యాప్త ఉద్యమానికి నాయకత్వం వహిస్తామని తెలిపింది. సవరణలను పూర్తిగా రద్దు చేసే వరకు ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. దేశంలోని ముస్లిం సమాజం నిరాశ చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ విషయంలో త్యాగాలకు సైతం వెనుకాడబోమని, దేశంలో న్యాయం కోసం నిలబడే శక్తులతో కలిసి ఉద్యమాన్ని నిర్మిస్తామని తెలిపింది. అన్యాయమైన సవరణలను సుప్రీంకోర్టులో సవాలు చేయడానికి చట్టపరమైన మార్గాన్ని ఉపయోగించుకోవడమే గాక, ప్రదర్శనలు, నిరసనలు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని ఏఐఎంపీఎల్‌బీ ప్రధాన కార్యదర్శి మౌలానా మొహమ్మద్ ఫజ్లుర్రహీం ముజాద్దిది స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టులో మరో పిటిషన్
వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు (Supreme court)లో మరో పిటిషన్ దాఖలైంది. కేరళలోని సమస్త కేరళ జమియతుల్ ఉలేమా వక్ఫ్ చట్టంపై అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. వక్ఫ్ సవరణలు మతపరమైన స్వభావాన్ని వక్రీకరిస్తాయని, వక్ఫ్ బోర్డుల పరిపాలనలో ప్రజాస్వామ్య ప్రక్రియను దెబ్బతీస్తాయని ఆరోపించింది. 2025 వక్ఫ్ చట్టం రాజ్యాంగంలోని సమాఖ్య సూత్రాలకు విరుద్ధమని, వక్ఫ్ బోర్డుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు, వక్ఫ్ బోర్డుల అన్ని అధికారాలు తొలగిపోయి కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి అధికారాలు వెళ్తాయని పిటిషన్‌లో పేర్కొంది. ఈ నిబంధనల కారణంగా ముస్లిం సమాజం వక్ఫ్ ఆస్తులను కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపింది. అంతకుముందు కాంగ్రెస్ (Congress), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), ఎంఐఎంలు సైతం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.






