Oyo: వివాదాస్పద యాడ్‌పై వివరణ ఇచ్చిన ఓయో

by S Gopi |

దేశంలో మతపరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి మాత్రమే ఆ ప్రకటన ఇచ్చామని స్పష్టం చేసింది.

Oyo: వివాదాస్పద యాడ్‌పై వివరణ ఇచ్చిన ఓయో
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రముఖ ఆతిథ్య రంగ కంపెనీ ఓయో పెద్ద ఎత్తున నెటిజన్ల విమర్శలతో వివాదంలో చిక్కుకుంది. ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన యాడ్‌లో కంపెనీ 'దేవుడు అన్ని చోట్ల ఉంటాడు, ఓయో కూడా' అనే నినాదాన్ని ప్రచురించింది. దీనిపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పాటు తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కొందరు 'బాయ్‌కాట్ఓయో' పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారు. ఇది కాస్త వైరల్ కావడంతో కంపెనీ వివాదం గురించి వివరణ ఇచ్చింది. దేశంలో మతపరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి మాత్రమే ఆ ప్రకటన ఇచ్చామని, ఎలాంటి మతపరమైన మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేసింది. ఓయో సేవలను అయోధ్య, వారణాసి, ప్రయాగ్‌రాజ్, అజ్మెర్, అమృత్‌సర్ లాంటి ఆధ్యాత్మిక ప్రదేశాల్లో అందిస్తున్నామని, అందుకే అటువంటి యాడ్ ఇచ్చినట్టు వివరించింది. దేశంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని పెంచే ప్రయత్నమే కానీ మరొకటి కాదు. సాంప్రదాయానికి కేంద్రమైన దేశంలో విశ్వాసం, నమ్మకాల విషయంలో సంస్థకు అపారమైన గౌరవం ఉంది. గత కొన్నేళ్లుగా చాలామంది భారతీయులు ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ఆదరిస్తున్నందున, దీనికి మరింత ప్రచారం కల్పించేందుకు యాడ్ ఇచ్చినట్టు తెలిపింది. ఈ ఏడాది ఆఖరు నాటికి ఓయో 12 ప్రధాన ఆధ్యాత్మిక ప్రాంతాల్లో 500 హోటళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఇటీవల ప్రకటించింది.

Next Story