Zelenskyy: యుద్ధం ముగించేందుకు మేం రెడీ..!

by Shamantha N |

ఉక్రెయిన్- రష్యా మధ్య ఉద్రిక్తతలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, యుద్ధం ముగింపునకు తాము సిద్ధమే అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మరోసారి స్పష్టం చేశారు.

Zelenskyy: యుద్ధం ముగించేందుకు మేం రెడీ..!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్- రష్యా మధ్య ఉద్రిక్తతలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, యుద్ధం ముగించేందుకు తాము సిద్ధమే అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మరోసారి స్పష్టం చేశారు. కానీ, రష్యా మాత్రం అందుకు రెడీగా ఉన్నట్లు తెలియట్లేదన్నారు. ‘రష్యాకు ఉన్న నిబంధనలు ఏంటో నాకు తెలియదు. ఈ యుద్ధం వల్ల మేం చాలా కోల్పోయాం. దీన్ని ముగించడం మాకు చాలా ముఖ్యం. అందుకు మేము రెడీగా ఉన్నాం. కానీ, రష్యా (Russia) మాత్రం అందుకు రెడీగా ఉన్నట్లు తెలియట్లేదు. మేము వారిని నమ్మే స్థితిలో లేం. ముందుగా కాల్పుల విరమణకు వారు అంగీకరించాలి. ఆ తర్వాత యుద్ధాన్ని పూర్తిగా ఆపేయాలి. ఇదే మేం కోరుతున్నాం. ఎలాంటి షరతులు లేకుండా ఈ కాల్పుల విరమణను ప్రతిపాదించినందుకు ట్రంప్‌నకు ధన్యవాదాలు’ అని జెలెన్‌స్కీ పేర్కొన్నారు.

రష్యాపై ఆంక్షలు విధించాలని డిమాండ్

రష్యా ఈ మారణకాండను ఆపేందుకు సిద్ధంగా లేకుంటే.. దానిపై ఆంక్షలు విధించాలని జెలెన్‌స్కీ డిమాండ్‌ చేశారు. మాస్కోపై ఒత్తిడి తీసుకొచ్చి కీవ్‌లో శాంతి నెలకొల్పాలన్నారు. రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య ప్రత్యక్ష చర్చలకు మద్దతిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ఇరుదేశాల అధ్యక్షులతో ఫోన్‌లో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్‌ కాల్‌ తర్వాత జెలెన్‌స్కీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, ట్రంప్‌ దాదాపు 2 గంటల పైనే ఫోన్‌లో మాట్లాడుకున్నారు. దీని అనంతరం ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపునకు సిద్ధంగా ఉన్నట్లు పుతిన్‌ తెలిపారు. ఉక్రెయిన్‌తో కలిసి శాంతి స్థాపనకు అంగీకరించిన ఆయన.. అందుకు పలు నియమాలు ఉన్నట్లు వెల్లడించారు. ఇక, ఈ ఫోన్‌ కాల్‌ తర్వాత ట్రంప్‌ మాట్లాడుతూ.. ఇరుదేశాలు తక్షణమే కాల్పుల విరమణ చర్చలు ప్రారంభిస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు.

Next Story