బెంగాల్ ఎన్నికల్లో ఓటర్ల సునామీ.. రెండో దశలో 89.99 శాతం పోలింగ్ నమోదు

by Kema Shiva Kumar |

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశలో రికార్డు స్థాయిలో 89.99 శాతం పోలింగ్ నమోదైంది.

బెంగాల్ ఎన్నికల్లో ఓటర్ల సునామీ.. రెండో దశలో 89.99 శాతం పోలింగ్ నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌లో ఓటర్లు సునామీలా పోటెత్తారు. సాయంత్రం 5 గంటల సమయానికే రాష్ట్రవ్యాప్తంగా 89.99 శాతం ఆల్‌టైమ్ రికార్డ్ పోలింగ్ నమోదైంది. ఇది 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే స్థానాల్లో నమోదైన 80.43 శాతం రికార్డును బద్దలుకొట్టింది. రాత్రికి తుది లెక్కలు వచ్చేసరికి ఈ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే, రెండో దశలో 8 జిల్లాల్లోని 142 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు ఉదయం నుంచే బారులు తీరారు. తూర్పు మేదినీపూర్‌‌లో అత్యధికంగా ఓటింగ్ నమోదైంది. డైమండ్ హార్బర్ ప్రాంతంలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక ముర్షిదాబాద్, నదియా జిల్లాల్లో కూడా 85 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు సమాచారం.

2021 రికార్డులను అధిగమించిన వైనం..

గత ఎన్నికలతో (2021) పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం సుమారు 9.5 శాతం పెరగడం విశేషం. సాధారణంగా పెరిగిన ఓటింగ్ శాతాన్ని ‘మార్పు కోరుకునే ఓటు’గా రాజకీయ విశ్లేషకులు భావిస్తారు. ఈ భారీ ఓటింగ్ అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు లాభిస్తుందా లేదా ప్రతిపక్ష బీజేపీకి కలిసొస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య శాంతియుతంగా పోలింగ్ నిర్వహించేందుకు ప్రయత్నించామని, భారీ స్థాయిలో ఓటింగ్ నమోదు కావడం ప్రజాస్వామ్య విజయమని ఎన్నికల సంఘం పేర్కొంది.

Next Story