Voter list: ఐదు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాపై సమీక్ష.. ఈసీ కీలక నిర్ణయం !

by B.Srinivas |

2026లో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ఈ ఏడాది చివరి నాటికి ఓటర్ల జాబితాలను సమగ్రంగా సమీక్షించనున్నట్టు సమాచారం.

Voter list:  ఐదు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాపై సమీక్ష.. ఈసీ కీలక నిర్ణయం !
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బిహార్‌తో పాటు 2026లో ఎన్నికలు జరగనున్న మరో ఐదు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలను సమగ్రంగా సమీక్షించనున్నట్టు సమాచారం. సమీక్షలో భాగంగా ఓటర్ల జాబితాను నిర్ధారించడానికి అధికారులు ఇంటింటికి వెళ్లి తనిఖీ చేయనున్నారు. అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ శాసనసభల పదవీకాలం వచ్చే ఏడాది మే-జూన్ నెలల్లో ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాపై సమగ్ర సమీక్ష ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభమవుతుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అలాగే ఈ ఏడాది చివర్లో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున, అక్కడ వెంటనే ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించాలని కూడా ఈసీ నిర్ణయించింది.

వేగవంతమైన పట్టణీకరణ, వలసలు, యువ పౌరులు ఓటు వేయడానికి అర్హులు కావడం, మరణాలను నివేదించకపోవడం, విదేశీ అక్రమ వలసదారుల పేర్లను చేర్చడం వంటి బహుళ కారణాల వల్ల ఈసీ ఈ డిసిషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రత్యేక సవరణను నిర్వహిస్తున్నప్పుడు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 326,1950 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 16లో స్పష్టంగా నిర్దేశించబడిన మార్గదర్శకాల ప్రకారమే ఈ చర్యలు చేపడుతోందని ఈసీ వర్గాలు తెలిపాయి. ఎటువంటి అక్రమాలకు తావులేకుండా ఓటర్ల జాబితాను రూపొందిస్తామని వెల్లడించాయి. కాగా, బిహార్‌లో చివరిసారిగా 2003లో ఓటర్ల జాబితాను సమీక్షించారు.

Next Story