Visa: నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాదారులకు షాక్.. కొత్త రూల్స్ పెట్టిన అమెరికా

by B.Srinivas |   (  Updated:2025-09-08 15:23:03  IST  )

సుంకాల వివాదం కారణంగా భారత్ అమెరికాల మధ్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అమెరికా వీసా నిబంధనలను కఠినతరం చేసింది.

Visa: నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాదారులకు షాక్.. కొత్త రూల్స్ పెట్టిన అమెరికా
X

దిశ, నేషనల్ బ్యూరో: సుంకాల వివాదం కారణంగా భారత్ అమెరికాల మధ్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అమెరికా వీసా నిబంధనలను కఠినతరం చేసింది. భారతీయులతో సహా నాన్-ఇమ్మిగ్రెంట్ (Non immigrant visa) వీసాకు దరఖాస్తు చేసుకునే వారు ఇప్పుడు ఇంటర్వ్యూ కోసం వారి దేశంలో లేదా చట్టబద్ధమైన నివాస స్థలంలో అపాయింట్‌మెంట్ తీసుకోవాలని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. ఈ మేరకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఇది వెంటనే అమల్లోకి రానున్నట్టు పేర్కొంది. దీంతో వీసా దరఖాస్తుదారులు తమ దేశం లేదా యూఎస్ ఎంబసీలో వీసా ఇంటర్వ్యూకు అపాయింట్ మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. వేరే దేశాల నుంచి అప్లికేషన్ పెట్టుకోవడానికి వీలుండదు. కాగా, నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా అనేది విదేశీయులు తాత్కాలిక ప్రయోజనాల కోసం యూఎస్‌లోకి ప్రవేశించడానికి అనుమతిస్తుంది. ఇది పర్యాటకం, వ్యాపారం, వైద్య చికిత్సలు సహా ఇతర కొన్ని పనులకు మాత్రమే ఇస్తారు.

ఇండియన్స్ పై ప్రభావం?

అమెరికా తాజా నిబంధనలతో భారతీయులపైనా ప్రభావం పడనున్నట్టు తెలుస్తోంది. సింగపూర్, థాయిలాండ్, జర్మనీలలో ఇంటర్వ్యూకు దరఖాస్తు చేసుకున్న భారతీయులను ప్రభావితం చేయనుంది. వారి దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటాయి. అలాగే అమెరికాకు వెళ్లాలనుకునే భారతీయులు విదేశాల్లో B1 (బిజినెస్), B2 (టూరిస్ట్) వీసాల అపాయింట్‌మెంట్ పొందలేరు. అంతకుముందు భారత్‌లో వీసా ఇంటర్వ్యూలకు ఎక్కువ కాలం పట్టేది. దీంతో భారతీయ పౌరులు ఇంటర్వ్యూలకు విదేశాలకు వెళ్లేవారు. ఇకపై ఇండియాలోనే వారు ఇంటర్వ్యూకు షెడ్యూల్ చేసుకోవాలి.

Next Story