- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Visa: అమెరికాకు చైనా షాక్.. హెచ్-1బీకి ప్రత్యామ్నాయంగా కొత్త వీసా !
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేసిన విషయం తెలిసిందే.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) హెచ్-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేసిన విషయం తెలిసిందే. వీసాపై రుసుములను భారీగా పెంచారు. కొత్త దరఖాస్తులపై దీనిని వసూలు చేయనున్నారు. దీంతో ఈ వీసాకు అప్లై చేసుకునే వారిలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో తాజా గందరగోళాన్ని సద్వినియోగం చేసుకోవడానికి చైనా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యువ ప్రతిభావంతులను తమ దేశానికి రప్పించేందుకు ‘కే-వీసా’ అనే కొత్త విధానాన్ని తీసుకొస్తున్నట్టు తెలిపింది. వచ్చే నెల నుంచి ఈ వీసాలను ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ రంగాల్లోని నిపుణులను ఆకర్షించేందుకు సిద్దమైనట్టు సమాచారం. ఈ రంగాల్లో టాలెంట్ ఉన్న యువతను బీజింగ్‌కు తీసుకురావడమే లక్ష్యంగా దీనిని ప్రవేశపెట్టనుంది.
వీసాతో ప్రయోజనాలివే?
ప్రస్తుతం చైనా 12 రకాల వీసాలను అందిస్తోంది. తాజాగా కే-వీసాను తీసుకురావడంతో ఇది 13వ వీసా కానుంది. ఇది ఇతర వీసాల కంటే భిన్నంగా ఉండనుంది. కే వీసాతో చైనాలోకి ప్రవేశించేవారు ఎడ్యుకేషన్, కల్చర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, బిజినెస్ వంటి రంగాల్లో పాల్గొనేందుకు చాన్స్ ఉంది. అయితే దరఖాస్తుదారులు అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అంతేగాక చైనా ఆర్, జెడ్ వీసాలను అందజేస్తున్నది. జెడ్ వీసాలు ఒక సంవత్సరం వరకు వ్యాలిడిటీ ఉండగా ఆర్ వీసాతో 180 రోజులు మాత్రమే చైనాలో ఉండేందుకు అనుమతి ఉంది. కానీ కే వీసా విదేశీయులను చైనాలో ఎక్కువ కాలం ఉండడానికి అనుమతిస్తుంది. అయితే కాలపరిమితి ఎంత అనేది స్పష్టంగా పేర్కొనలేదు. అలాగే జెడ్ వీసాకు అప్లై చేసుకునే ముందే చైనా కంపెనీ నుంచి అపాయింట్‌మెంట్ లెటర్ పొందాలి, కానీ కే వీసాకు ఇటువంటి రూల్స్ లేవు. ఉద్యోగ నియామకపత్రం అవసరం లేకుండానే చైనాలోకి ఎంట్రీ ఇవ్వొచ్చు. కేవలం విద్యార్హతలు ఉంటే సరిపోతుంది. దరఖాస్తు చేసుకోవడం సైతం సులభతరం అవుతుంది.
ప్రతిభావంతులను ఆకర్షించడమే లక్ష్యం
దేశ అభివృద్ధికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతుల భాగస్వామ్యం అవసరమని చైనా తెలిపింది. టాలెంటెడ్ యువతకు అవకాశాలను అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ప్రస్తుత యుగంలో చైనా శ్రామిక శక్తి అభివృద్ధి వ్యూహాన్ని మరింతగా అమలు చేయడం, విదేశీ యువ సైన్స్-టెక్ ప్రతిభను తమ దేశంలోకి ప్రవేశించడానికి వీలు కల్పించడమే లక్ష్యమని తెలిపింది. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ మార్పిడులను ప్రోత్సహించడానికి వీసా నియమాలను క్రమబద్ధీకరించడానికి చైనా నిరంతరం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే హెచ్ 1బీ వీసాలపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో తాజా నిర్ణయానికి ప్రాధాన్యత సంతరించుకుంది.
కే వీసాను అమెరికన్ హెచ్ 1బీ వీసా చైనీస్ వెర్షన్ అని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు వర్క్ వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్న సమయంలో అధిక నైపుణ్యం కలిగిన ప్రతిభను ఆకర్షించడానికి చైనా ఈ వీసాను రూపొందించింది. కాబట్టి ఇది యూఎస్ వీసాకు ప్రత్యామ్నాయం కావొచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా దక్షిణాసియా నుండి వచ్చే నిపుణులకు ఎంతో ఉపయోగ పడుతుందని అంచనా వేస్తున్నారు. కాగా, ఇటీవల అమెరికా కొత్త హెచ్ 1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునే రుసుమును లక్ష డాలర్లకు పెంచింది.






