వైరల్ వీడియో కలకలం: జూనియర్ విద్యార్థినిపై సీనియర్ల దాడి.. ప్రైవేట్ వర్సిటీలో ఘటన

by Ramesh Naini |

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఉన్న ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో ర్యాగింగ్ పేరుతో సీనియర్లు రెచ్చిపోయారు.

వైరల్ వీడియో కలకలం: జూనియర్ విద్యార్థినిపై సీనియర్ల దాడి.. ప్రైవేట్ వర్సిటీలో ఘటన
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఉన్న ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో ర్యాగింగ్ పేరుతో సీనియర్లు రెచ్చిపోయారు. జూనియర్ విద్యార్థినిపై దారుణంగా దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో తీవ్ర దుమారం రేగుతోంది. ఈ ఘటనపై యాజమాన్యం, పోలీసుల తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో.. ఒక జూనియర్ విద్యార్థినిని కొందరు సీనియర్లు చుట్టుముట్టి వేధించడం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక సీనియర్ విద్యార్థిని జూనియర్‌ను పదేపదే కొడుతుండగా, మిగిలిన వారు దాన్ని ఆపకుండా మరింత ప్రోత్సహిస్తూ నిలబడ్డారు. బాధితురాలు తనను కొట్టొద్దని వేడుకుంటూ, తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ వారు కనికరించలేదు. పైగా, ఏదో తప్పు చేసినట్లుగా క్షమాపణలు చెప్పాలని ఆమెను బలవంతం చేశారు.

ఇది చదువు కాదు.. గూండాయిజం

ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇది కేవలం ర్యాగింగ్ కాదని, నేరపూరితమైన దాడి అని అభివర్ణించారు. ‘ఇది విద్యాసంస్థ కాదు, గూండాయిజం. యాజమాన్యం, పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోకపోతే క్యాంపస్ సంస్కృతి పూర్తిగా నాశనమవుతుంది’ అని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. యూజీసీ (UGC) నిబంధనలు, భారతీయ న్యాయ సంహిత (BNS) ప్రకారం నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, వెంటనే వర్సిటీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ‘ఇంత దారుణంగా కొడుతుంటే ఒక్కరు కూడా ఆమెకు అండగా ఎందుకు రాలేదు?’ అని మరో నెటిజన్ ప్రశ్నించారు.

పోలీసులు, వర్సిటీ స్పందన

ఈ ఘటనపై గ్రేటర్ నోయిడా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) స్పందించారు. దాద్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ వర్సిటీ క్యాంపస్‌లో 10 నుంచి 12 రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్లు విచారణలో తేలిందన్నారు. దీనిపై యూనివర్సిటీ యాజమాన్యం ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసిందని, దాడికి పాల్పడిన వారిపై తగిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు వెల్లడించారు.

అబ్బాయి కోసమే గొడవ?

మరోవైపు, ఈ గొడవకు సంబంధించి ఆన్‌లైన్‌లో పలు ఆసక్తికర విషయాలు ప్రచారంలో ఉన్నాయి. ‘అర్జున్ సింగ్’ అనే అబ్బాయి కారణంగానే ఈ వివాదం తలెత్తినట్లు ఓ స్క్రీన్‌షాట్ వైరల్ అవుతోంది. దాడికి పాల్పడిన సీనియర్ పేరు ‘సిద్ధి’ అని, బాధితురాలి పేరు ‘అనుష్క’ అని అందులో పేర్కొన్నారు. వీరిద్దరూ స్నేహితులని, వీరి కుటుంబాలకు కూడా ఒకరికొకరు పరిచయం ఉందని సమాచారం. ఈ క్రమంలోనే అనుష్క తన స్నేహితురాలైన సిద్ధిని క్షమించిందని, ఇరు వర్గాలు రాజీకి రావడంతో ఈ ఘటనపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. నిందితురాలిని వర్సిటీ నుంచి రస్టికేట్ (Rusticate) చేశారనే వార్తలు కూడా వస్తున్నప్పటికీ, దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం వర్సిటీ అంతర్గత కమిటీ ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరుపుతోంది.

Next Story