- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాక్‌లో చెలరేగుతోన్న బలూచ్ రెబల్స్.. 9 మంది హత్య
పాకిస్థాన్‌లో బలోచిస్థాన్ ప్రాంతంలో తిరుగుబాటు చర్యలు మళ్లీ ఉధృతంగా కొనసాగుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్థాన్‌లో బలోచిస్థాన్ ప్రాంతంలో తిరుగుబాటు చర్యలు మళ్లీ ఉధృతంగా కొనసాగుతున్నాయి. తాజాగా దక్షిణ బలోచిస్థాన్ ప్రావిన్స్‌లోని పర్వత ప్రాంతాల్లో అఘాయిత్య ఘటన జరిగింది. పలు వాహనాలను నిలిపివేసి, ప్రయాణికులను కిడ్నాప్ చేసిన దుండగులు, అనంతరం తొమ్మిది మందిని కాల్చిచంపారు.
గురువారం సాయంత్రం బస్సులను ఆపిన బలూచ్ రెబల్స్.. ప్రయాణికుల్ని బలవంతంగా సమీప కొండల్లోకి తీసుకెళ్లి హత్య చేసినట్లు స్థానిక మీడియా, అధికారులు తెలిపారు. అర్ధరాత్రి వారి మృతదేహాలు కనిపించగా, ఇప్పటివరకు ఈ దాడికి ఎవరూ అధికారికంగా బాధ్యత వహించలేదు. అయితే గతంలో ఇలాంటి దాడులకు పాల్పడిన బలోచ్ రెబల్స్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుల్లో ఎక్కువ మంది పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించబడినట్లు సమాచారం.
‘ఆపరేషన్ బామ్’ పేరుతో బీఎల్‌ఏ దాడులు
ఈ ఘటనకు కొద్ది రోజుల ముందే, బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) దేశ వ్యాప్తంగా పలు దాడులకు తెరలేపింది. మంగళవారం ప్రారంభమైన ఈ ఆపరేషన్‌కు ‘ఆపరేషన్ బామ్’ అనే పేరు పెట్టారు. పంజ్‌గర్, ఖరన్, కెచ్, సురబ్ జిల్లాల్లో మొత్తం 17 దాడులు జరిగినట్లు సమాచారం. ఈ దాడుల్లో ప్రభుత్వ కార్యాలయాలు, సైనిక స్థావరాలు, చెక్‌పాయింట్లు లక్ష్యంగా మారాయి. బీఎల్‌ఎఫ్ ప్రతినిధి ప్రకారం.. ఇది బలోచిస్థాన్ స్వాతంత్ర్య పోరాటంలో కొత్త అధ్యాయంగా నిలుస్తుందని తెలిపారు. భద్రతా బలగాలపై ఘాటుగా దాడి చేసి ఆయుధాలు, వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. బలోచ్ తిరుగుబాటుదారుల ఈ చర్యల వల్ల పాక్ భద్రతా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతున్నట్లు అంచనా.
బలోచిస్థాన్ ప్రాంతం చాలా కాలంగా పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది. స్థానిక వనరుల దోపిడీ, రాజకీయ అణచివేతకు నిరసనగా బలోచ్ గ్రూపులు సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. తాజా ఘటనలతో ఈ ఉద్యమం మళ్లీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.






