- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ వైపు విజయ్ భార్య..? తమిళనాడు రాజకీయాల్లో హాట్‌టాపిక్
‘తమిళగ వెట్రి కళగం’ అధినేత, ముఖ్యమంత్రి విజయ్ మాజీ భార్య సంగీత సోర్ణలింగం బీజేపీలో చేరబోతున్నారనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వ్యూహాలు చర్చనీయాంశంగా మారాయి. ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) అధినేత, ముఖ్యమంత్రి విజయ్ భార్య సంగీత సోర్ణలింగం బీజేపీలో చేరబోతున్నారనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. విజయ్‌కు రాజకీయంగా చెక్ పెట్టే వ్యూహంలో భాగంగానే ఈ ఆహ్వానం అందుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
తెరవెనుక బీజేపీ వ్యూహాత్మక అడుగులు
రాజకీయ విశ్లేషకుల కథనం ప్రకారం, విజయ్ ఎదుగుదలకు కౌంటర్ ఇచ్చేందుకు బీజేపీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే సంగీతను పార్టీలోకి తీసుకురావడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఓ ప్రముఖ నటి, సీనియర్ నాయకురాలు ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, సంగీతను ఒప్పించేందుకు తెరవెనుక తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.
దూరంగా ఉంటున్న కుటుంబం..
గత కొన్నేళ్లుగా విజయ్, సంగీత మధ్య విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరి విడాకుల వ్యవహారం కేసు కోర్టులో నడుస్తోంది. లండన్‌లో స్థిరపడిన శ్రీలంక తమిళ వ్యాపార కుటుంబానికి చెందిన సంగీత, 1999లో విజయ్‌ను వివాహం చేసుకున్నారు. అయితే, ఇటీవల కాలంలో విజయ్‌కు సంబంధించిన కీలక పబ్లిక్ ఈవెంట్స్, రాజకీయ కార్యక్రమాల్లో వారి పిల్లలు సైతం కనిపించకపోవడం ఈ తాజా రాజకీయ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చింది.
అధికారిక స్పష్టత లేదు
ఈ ప్రచారంపై అటు సంగీత వైపు నుంచి గానీ, ఇటు బీజేపీ అధిష్టానం నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. విజయ్ రాజకీయ ప్రాభవాన్ని, ఆయనకున్న ప్రజాదరణను ఒత్తిడికి గురిచేసేందుకే ప్రత్యర్థి వర్గాలు ఈ తరహా వ్యూహాన్ని తెరపైకి తెచ్చి ఉంటాయని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ విజయ్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి ప్రత్యర్థి పార్టీలో చేరితే, అది తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీస్తుందని భావిస్తున్నారు.






