కరూర్ తొక్కిసలాట ఒక కుట్ర.. సీబీఐ విచారణకు టీవీకే పార్టీ డిమాండ్, హైకోర్టులో పిటిషన్

by Naga Rani Yarlagadda |

తాజాగా.. ఈ ఘటనపై టీవీకే పార్టీ మద్రాస్ హైకోర్టులోని మధురై బెంచ్ ను ఆశ్రయించింది. ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదని, కుట్ర జరిగిందని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేసింది.

కరూర్ తొక్కిసలాట ఒక కుట్ర.. సీబీఐ విచారణకు టీవీకే పార్టీ డిమాండ్, హైకోర్టులో పిటిషన్
X

దిశ, వెబ్‌డెస్క్: కరూర్ లో శనివారం రాత్రి టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో జరిగిన తొక్కిసలాట వెనుక కుట్ర కోణం ఉందని టీవీకే పార్టీ అధిష్ఠానం ఆరోపించింది. ఈ తొక్కిసలాటలో అమాయకులైన 39 మంది మరణించగా.. 80 మందికి పైగా క్షతగాత్రుల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా.. ఈ ఘటనపై టీవీకే పార్టీ మద్రాస్ హైకోర్టులోని మధురై బెంచ్ ను ఆశ్రయించింది. ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదని, కుట్ర జరిగిందని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేసింది. పోలీసుల లాఠీ చార్జి, జనంలో రాళ్ల దాడి జరిగిందని పేర్కొంది. విజయ్ రాకకు ముందు ఆ ప్రాంతంలో కరెంట్ పోవడంతో ఇరుకైన రోడ్లలో ఉన్న ప్రజల మధ్య తోపులాట జరిగిందని తెలిపింది. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని టీవీకే పిటిషన్ లో కోరింది. ఈ పిటిషన్ ను స్వీకరించిన కోర్టు.. రేపు విచారణ చేయనుంది.

కాగా.. కరూర్ తొక్కిసలాటకు దారితీసిన కారణాలేంటో ప్రత్యక్ష సాక్ష్యులు వివరించారు. అకస్మాత్తుగా జనం రద్దీ పెరగడంతో కుటుంబాలు విచ్చిన్నమై.. తోపులాట జరిగినట్లు చెప్తున్నారు. పిల్లలకు ఊపిరాడక మరణించినట్లు పోస్టుమార్టం నివేదికల్లో నిర్ధారణైనట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం ఆ ప్రాంతంలో చెల్లాచెదురుగా పడి ఉన్న చెప్పులు, చిరిగిన బట్టలు, విరిగిన స్తంభాలు, ముక్కలైన గాజు సీసాలు.. తొక్కిసలాట ఏ స్థాయిలో జరిగిందో అద్దం పడుతున్నాయి.

ఇదిలా ఉండగా.. టీవీకే చీప్ విజయ్ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విజయ్ ఇంటిని ముట్టడించేందుకు విద్యార్థి సంఘాలు ప్రయత్నించగా.. నేతలను పోలీసులు అడ్డుకున్నారు. తొక్కిసలాటలో 39 మంది అమాయకుల చావుకు కారణమైన విజయ్ ను అరెస్ట్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.

Next Story