మరో ట్విస్ట్ ఇచ్చిన విజయ్.. స్టాలిన్‍తో భేటీకి నిర్ణయం!

by Prasad Jukanti |   (  Updated:2026-05-11 08:10:54  IST  )

సీఎంగా బాధ్యతలు చేపట్టాక విజయ్ నిర్ణయాలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలో బలనిరూపణకు ముందు డీఎంకే చీఫ్ స్టాలిన్‌తో భేటీ కాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

మరో ట్విస్ట్ ఇచ్చిన విజయ్.. స్టాలిన్‍తో భేటీకి నిర్ణయం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడు రాజకీయాల్లో సినిమాలను తలపించే ట్విస్టులు నమోదు అవుతున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక సీఎం విజయ్ (CM Joseph Vijay) తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనంగా మారాయి. సీఎంగా తన తొలి స్పీచ్‍లోనే గత ప్రభుత్వం చేసిన అప్పులపై సంచలన ఆరోపణలు చేసిన విజయ్ సోమవారం మరో ట్విస్ట్ ఇచ్చారు. ఆయన త్వరలో మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే (DMK) అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్‌తో (MK Stalin) భేటీ కానున్నట్లు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో మర్యాదపూర్వకంగా స్టాలిన్‌ను కలవాలని నిర్ణయించుకున్నట్లు తమిళ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

బలనిరూపణ కోసమా మర్యాద కోసమా?:

స్టాలిన్ తో భేటీ కావాలన్న విజయ్ ఆలోచన వెనుక అసలు వ్యూహం ఏంటనేది ఆసక్తిగా మారింది. టీవీకే సహా మొత్తం ఆరు పార్టీలతో మద్దతుతో విజయ్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు మొత్తం 120 మంది సభ్యుల బలాన్ని గవర్నర్‍కు చూపించి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన గవర్నర్ ఆర్లేకర్ ఈ నెల 13వ తేదీన అసెంబ్లీలో బలనిరూపణ ద్వారా మెజారిటీ చూపాలని గవర్నర్ సూచించారు. ఈ నేపథ్యంలో తమ ప్రత్యర్థి డీఎంకే చీఫ్ తో విజయ్ భేటీ కాబోతున్నారనే ప్రచారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాశంగా మారింది. మర్యాదపూర్వకంగానే స్టాలిన్‍తో విజయ్ భేటీ కావాలని నిర్ణయించుకున్నారా లేక బలనిరూపణ విషయంలో ఎలాంటి తేడా జరగకుండా ఉండేందుకు ఈ ఎత్తుగడ వేశారా అనేది ఉత్కంఠగా మారింది. ఇదే నిజమైతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ కు ఇది తొలి కీలక రాజకీయ భేటీ కానుంది. తమిళనాడులో కొత్త ప్రభుత్వానికి ఇది ఆసక్తికరమైన ప్రారంభంగా మారబోతోంది అనే టాక్ వినిపిస్తోంది.

తమిళనాడు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా సీఎం విజయ్ ప్రమాణ స్వీకారం

Next Story