TVK విజయ్ ప్రభంజనం.. నాడు పీవీకే షాకిచ్చిన రజనీకాంత్.. 1996లో అసలేం జరిగింది?

by Prasad Jukanti |   (  Updated:2026-05-05 11:52:12  IST  )

తమిళనాడులో విజయ్ ప్రభంజనం వేళ రజనీకాంత్ పాలిటిక్స్ ఎంట్రీపై చర్చ జరుగుతోంది. 1996లో పీవీ నర్సింహారావు ఆఫర్‌ను రజనీ ఎందుకు కాదన్నారనేది ఆయన అభిమానుల్లో ఆసక్తి గా మారింది.

TVK విజయ్ ప్రభంజనం.. నాడు పీవీకే షాకిచ్చిన రజనీకాంత్.. 1996లో అసలేం జరిగింది?
X

దిశ, డైనమిక్ బ్యూరో: 'ఎప్పుడు వచ్చామన్నది కాదు. బుల్లెట్ దిగిందా లేదా' ఇది టాలీవుడ్ మూవీలోని ఓ ఫేమస్ డైలాగ్. ఈ లైన్‍ను మరోసారి రీసౌండ్ అయ్యేలా నిన్నటి తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో చేసి చూపించాడు టీవీకే అధినేత విజయ్ దళపతి. కాకలు తీరిన రాజకీయ పార్టీలకు, దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీ నేతలను మట్టి కరిపిస్తూ తాను పార్టీ స్థాపించిన 2 సంవత్సరాల్లోనే ఏకంగా సీఎం పోస్టుకు అడుగు దూరంలో నిలిచాడు. విజయ్ దక్కించుకున్న ఈ విజయం చూసిన సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు తమ అభిమాన హీరో అద్భుతమైన చాన్స్ మిస్ చేసుకున్నారా అనే చర్చ తమిళ పాలిటిక్స్ లో జోరుగా వినిపిస్తోంది.

మూడు దశాబ్దాల పాటు ఊగిసలాట:

విజయ్ సాధించిన విజయంతో ఇప్పుడు రజనీకాంత్ పేరు తెరపైకి రావడం వెనుక దాదాపు మూడు దశాబ్దాలుగా రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై వస్తున్న రకరకాల ఊహాగానాలే కారణం. రజనీ మక్కలు మండ్రం పేరుతో ఫ్యాన్స్ క్లబ్ ను ఏర్పాటు చేశారు. ఈ ట్యాగ్ లైన్ కింద రజనీకాంత్ తరచూ తన అభిమానులతో భేటీ అవుతూ వచ్చారు. 2017, 2020లో తన ఫ్యాన్స్ క్లబ్ ద్వారా అభిమానులకు దగ్గరయ్యేందుకు ఆయన చేసిన ప్రయత్నాలతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారనే చర్చ జోరుగా సాగింది. ఆ సమయంలో అన్నా డీఎంకే అధినేత్రి జయలలితా, డీఎంకే చీఫ్ కరుణానిధి అగ్రనేతలు కాలం చేయడంతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త తరం రాకీయాలకు మంచి అవకాశం వచ్చింది. దాంతో తమిళనాడు విశేష ప్రజాభిమానం కలిగిన రజనీకాంత్ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని భావించినా ఆయన మాత్రం ముందడుగు వేయలేక పోయారు. ప్రస్తుతం 2026లోనూ ఓవైపు ఎన్డీయే కూటమిలో కుమ్ములాటలు, స్టాలిన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ రజనీకాంత్ మాత్రం ధైర్యం చేయలేదని ఒక వేళ రాజకీయాల్లోకి ప్రవేశించి ఉంటే ఆయన ఈపాటికి ముఖ్యమంత్రి పీఠం ఎక్కేవాడే కదా అనే చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్‍లో చేరిక!:

రెండేళ్ల క్రితం విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తే రజనీకాంత్ మాత్రం 30 ఏళ్లుగా రాజకీయ రంగ పరవేశం కోసం ముందుకు వెనక్కి అవుతూనే ఉన్నారు. ఈ క్రమంలో మూడు దశాబ్దాల క్రితం కాంగ్రెస్ పార్టీకి రజనీకాంత్ ఇచ్చిన ఝలక్ ఆ పార్టీ నేతలు ఎవరూ మర్చిపోలేరు. పీవీ నర్సింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో రజనీకాంత్ ట్విస్ట్ కు కాంగ్రెస్ ఊహించని షాక్ కు గురైంది. ప్రధానిగా పీవీ ఉన్న సమయంలో వచ్చే ఎన్నికల్లో తమిళనాడులో ఎవరితో కలిసి వెళ్దామనే చర్చ జరుగుతోంది. అధికారంలో ఉన్న జయలలిత తమపై ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారని ఆమెతో పొత్తు వద్దని స్థానిక కాగ్రెస్ నేతలు కోరుతుంటే రాజీవ్ హత్య కేసు వ్యవహారానికి సంబంధించిన కేసు కారణంగా డీఎంకేతో కాంగ్రెస్ కలవని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో కాంగ్రెస్‍కు ఓ సంజీవని మూలికలా రజనీకాంత్ కనిపించారు. దాంతో రాష్ట్ర నేతలు పీవీతో మాట్లాడి రజనీకాంత్‍ను కాంగ్రెస్‍లో చేర్పించేందుకు రంగం సిద్ధం చేశారు.

ప్లైట్ దిగగానే రజనీ ట్విస్ట్!:

ముపనార్‍తో పాటు ఢిల్లీ వచ్చిన రజనీకాంత్ అదే రోజు రాత్రి రేస్ కోర్స్ రోడ్డులోని ప్రధాన మంత్రి నివాసానికి చేరుకున్నారు. అక్కడ రజనీకాంత్ స్వయంగా పీవీని కలిశారు. అక్కడ రజనీకాంత్‍ను పీవీ లాంఛనంగా కాంగ్రెస్‍లోకి ఆహ్వానించారు. ఒక వేళ తమిళనాడులో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం సైతం నీదే అనే విశ్వాసం ఆయనలో కల్పించారు. అయితే రజనీకాంత్ మాత్రం కాంగ్రెస్ నేతలు చెప్పిన మాటలన్నింటికి ఓకే చెప్పడంతో ఇక తాము రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం అనేంతలా సంబరాలు చేసుకున్నారు. ఢిల్లీ నుంచి ముపనార్ వంటి నేతలు రాష్ట్రానికి ఫోన్లు చేసి రజనీకాంత్ కు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకోమని ఆదేశాలు పంపించారు. రజనీకాంత్ చేరిన ఆనందంలో జయలలితపై తమిళ కాంగ్రెస్ నేతలు సవాళ్లతో హడావుడి చేశారు. అయితే మర్నాడు సాయంత్రం చెన్నై చేరుకున్న రజనీకాంత్ అక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. తనకు రాజకీయాల్లోకి దిగాలన్న ఆలోచన ఏమీ లేదని ప్రధాన మంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నానంటూ చెప్పేశాడు. రజనీ మాటలు విన్న ముపనార్, చిదంబరం తదితర తమిళ కాంగ్రెస్ నాయకులు షాక్ తిన్నారు. 1996లో జరిగిన ఈ సంఘటనలను నాడు పీఎం పీవీకి సలహాదారుగా పని చేసిన ఐఏఎస్ ఆఫీసర్ పి.వి.ఆర్. కే ప్రసాద్ 'అసలేం జరిగిందంటే' పుస్తకంలో పూసగుచ్చినట్లు వివరించారు.

ఎన్టీఆర్ నుండి విజయ్ వరకు.. మొదటి ఎన్నికల్లో నటులకు వచ్చిన ఓటు షేరింగ్ వివరాలు

Next Story