బోటు ప్రమాదంలో 15 మంది భారతీయ పర్యాటకులు మృతి.. సంతాపాన్ని ప్రకటించిన వియత్నాం ప్రభుత్వం!

by Malleboina Mahesh |   (  Updated:2026-07-12 11:35:42  IST  )

వియత్నాంలో భారతీయ పర్యాటకుల పడవ ప్రమాదం.. 15 మంది మృతి చెందగా వియత్నాం ప్రభుత్వం ప్రగాఢ సానుభూతి తెలిపింది.

బోటు ప్రమాదంలో 15 మంది భారతీయ పర్యాటకులు మృతి.. సంతాపాన్ని ప్రకటించిన వియత్నాం ప్రభుత్వం!
X

దిశ, వెబ్ డెస్క్: వియత్నాంలో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన ఫు క్వాక్ ద్వీపం సమీపంలో భారతీయ పర్యాటకులతో వెళ్తున్న ఒక స్పీడ్‌బోట్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో బోటులో 32 మంది భారతీయ ప్రయాణికులతో పాటు నలుగురు స్థానిక సిబ్బంది ఉండగా, వారిలో 21 మందిని రక్షించారు. మృతులలో 10 మంది తమిళనాడుకు, ముగ్గురు ఆంధ్రప్రదేశ్‌కు, ఇద్దరు కేరళకు చెందిన వారు ఉన్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఒక మొబైల్ కంపెనీ స్పాన్సర్ చేసిన టూర్‌లో భాగంగా విహారయాత్రకు వెళ్లిన వీరంతా తిరిగి వస్తుండగా బలమైన గాలుల కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ఘోర విషాదం పై వియత్నాం అగ్రనేతలు, ప్రెసిడెంట్ తో లామ్, ప్రధానమంత్రి లే మిన్ హంగ్ స్పందిస్తూ.. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై వియత్నాం ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. మరోవైపు, బాధితుల కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందించడం, గాయపడిన వారికి వైద్య సేవలు అందించడంతో పాటు, మరణించిన వారి భౌతిక కాయాలను వీలైనంత త్వరగా భారతదేశానికి తరలించేందుకు (Repatriation) హనోయ్‌లోని భారత రాయబార కార్యాలయంతో కలిసి వియత్నాం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ప్రకటించారు.

Next Story