Dhankhar: బిన్ లాడెన్ మృతి ఘటనతో ఆపరేషన్ సిందూర్ ని పోల్చిన ఉపరాష్ట్రపతి

by Shamantha N |   (  Updated:2025-05-17 11:32:26  IST  )

ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో పాక్ లోని ఉగ్రస్థావరాలపై భారత్ విరుచుకుపడింది. కాగా.. ఈ ఘటనపై ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధంఖర్ (Jagdeep Dhankhar) కీలక వ్యాఖ్యలు చేశారు

Dhankhar: బిన్ లాడెన్ మృతి ఘటనతో ఆపరేషన్ సిందూర్ ని పోల్చిన ఉపరాష్ట్రపతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో పాక్ లోని ఉగ్రస్థావరాలపై భారత్ విరుచుకుపడింది. కాగా.. ఈ ఘటనపై ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధంఖర్ (Jagdeep Dhankhar) కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ బిన్‌ లాడెన్‌ (Osama bin Laden)ను అమెరికా హతమార్చిన ఘటనతో ఆపరేషన్‌ సిందూర్‌ను పోల్చారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ధంఖర్ పేర్కొన్నారు. ‘‘ప్రపంచానికి తెలిసేలా భారత్ చేసి చూపించింది. శాంతియుత వాతావరణానికి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ముష్కరులను మట్టుబెట్టడం ద్వారా ఒక బెంచ్‌ మార్క్‌ను నిర్ణయించింది’’ అని అన్నారు. భారత్‌ గతంలో ఎప్పుడూ లేని విధంగా పాక్‌లోకి చొచ్చుకొని వెళ్లి మరీ ఉగ్రవాదులను హతమార్చిందన్నారు. ఎంతో కచ్చితత్వంతో దాడులు చేసిందని, ఉగ్రవాదులకు మాత్రమే నష్టం వాటిల్లిందని అన్నారు. 2011, మే 2న అమెరికా దళాలు ఇదేవిధంగా వ్యవహరించాయని లాడెన్ పేరు ప్రస్తావించకుండా మాట్లాడారు. అంతేకాకుండా, భారత ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే దేశాల ఆర్థిక వ్యవస్థలకు సాయం చేయలేమని ధంఖర్ చెప్పారు. మనలో ప్రతి ఒక్కరు ఆర్థిక జాతీయవాదం గురించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తుర్కియే, అజర్‌బైజాన్‌ లాంటి దేశాలు పాక్ కు మద్దతిస్తున్న వేళ ఉపరాష్ట్రపతి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Next Story