Uttarakhand: రేపటి నుంచి ఉత్తరాఖండ్‌లో యూసీసీ అమలు.. దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డ్

by B.Srinivas |

దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ (UCC)ని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించనుంది.

Uttarakhand: రేపటి నుంచి ఉత్తరాఖండ్‌లో యూసీసీ అమలు.. దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డ్
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ (UCC)ని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించనుంది. రాష్ట్రంలో సోమవారం నుంచి యూసీసీ అమలులోకి రానుందని సీఎం పుష్కర్‌సింగ్ ధామి (Pushkar singh dhami) తెలిపారు. పౌరులందరికీ సమాన హక్కులు, బాధ్యతలు ఉండేలా సమాజంలో ఏకరూపతను తీసుకురావడానికి ఈ చట్టాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు. యూసీసీని అమలుకు అన్ని సన్నాహాలు పూర్తయ్యాయని, దీనికి సంబంధించిన నిబంధనల ఆమోదం పొందడంతోపాటు సంబంధిత అధికారులకు శిక్షణ ఇచ్చామని స్పష్టం చేశారు. యూసీసీ కోసం అభివృద్ధి చేసిన ఆన్‌లైన్ పోర్టల్ మాక్ డ్రిల్ విజయవంతంగా పూర్తయిందని తెలిపారు.

దేశాన్ని అభివృద్ధి చెందిన, స్వావలంబన కలిగిన దేశంగా మార్చేందుకు ప్రధాని చేస్తున్న గొప్ప ప్రయత్నమే యూసీసీ అని కొనియాడారు. సీఎం ధామి చీఫ్ సేవక్ సదన్‌లో యూసీసీ పోర్టల్‌ను ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. కాగా, యూసీసీ అమలుపై 2022లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజనా ప్రకాష్ దేశాయ్ అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 2024 ఫిబ్రవరి 2న ప్రభుత్వానికి ముసాయిదా నివేదికను సమర్పించింది. ఈ క్రమంలో అదే ఏడాది మార్చి 8న అసెంబ్లీ ఆమోదించగా 12వ తేదీన రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీంతో అప్పటి నుంచి అమలు ప్రక్రియను పరిశీలించిన ప్రభుత్వం తాజాగా అమలులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.

Next Story