- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Donald Trump: అమెరికాలో ఎన్ఆర్ఐలకు షాకిచ్చిన ట్రంప్ ప్రభుత్వం
విదేశీయులు చేసే అన్ని రకాల అంతర్జాతీయ నగదు బదిలీలపై 5 శాతం పన్ను విధించనున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన నాటి నుంచి సుంకాల పేరుతో ఇతర దేశాలను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అమెరికాలో నివశిస్తున్న విదేశీయులపైనా రకరకాల నిబంధనలు విధిస్తుండటంతో ట్రంప్‌పై అసంతృప్తి తీవ్రంగా వినిపిస్తోంది. తాజాగా అమెరికాలో మరో చట్టం ద్వారా విదేశీయులపై ఆర్థిక భారం మోపనున్నట్టు సమాచారం. 'ది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్' అని పేరు పెట్టిన ఈ చట్టం ద్వారా విదేశీయులు చేసే అన్ని రకాల అంతర్జాతీయ నగదు బదిలీలపై 5 శాతం పన్ను విధించనున్నారు. అయితే, ఈ చట్టం వల్ల ఇతర దేశాల వారి సంగతేమో కానీ భారతీయులు ఎక్కువ ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతిపాదిన చట్టం అమల్లోకి వస్తే సొంత దేశానికి డబ్బు పంపడం మరింత ఖరీదవుతుందని అమెరికాలో నివశించే ప్రవాస భారతీయూలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హెచ్-1బీ, ఎఫ్-1 లాంటి నాన్-ఇమిగ్రెంట్ వీసా ఉన్నవారితో పాటు గ్రీన్ కార్డు ఉన్నవారు, పత్రాలులేని వలసదారులై పన్ను భారం పడుతుంది. పేపాల్, వెస్ట్రన్ యూనియన్, బ్యాంకుల ద్వారా నగదు బదిలీలపై పన్ను వసూలు చేయనున్నారు. ప్రస్తుతానికి ఈ పన్ను విషయంలో ప్రతిపాదిత దశలో ఉండగా, ఆమోదం లభిస్తే, జూలై నుంచి అమలు చేయనున్నట్టు తెలుస్తోంది.
భారతీయులపైనే ఎక్కువ ప్రభావం
భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా చెల్లింపులు పొందుతున్న దేశం. 2023లో 129 బిలియన్ డాలర్లు(రూ. 11 లక్షల కోట్లకు పైనే) విదేశాల్లో ఉన్నవారి నుంచి దేశంలోకి వస్తున్నాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) తెలిపింది. ఇందులో దాదాపు రూ. 2.74 లక్షల కోట్లు అమెరికా నుంచి వచ్చాయి. ఇది మిగిలిన దేశాల కంటే చాలా ఎక్కువ. అలాంటిది అంతర్జాతీయ బదిలీలపై 5 శాతం పన్ను విధించడం వల్ల భారత్‌లో ఉన్నవారికి ఏటా సుమారు రూ. 15,000 కోట్ల అదనపు భారం పడుతుంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం, దాదాపు 45 లక్షల మంది భారతీయులు అమెరికాలో నివసిస్తున్నారు. ఇందులో దాదాపు 32 లక్షల మంది భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు కూడా ఉన్నారు. భారత్‌లోని కుటుంబ సభ్యుల కోసం అమెరికా నుంచి చెల్లింపులు చాలా సర్వసాధారణంగా జరుగుతుంది. ముఖ్యంగా విద్య, వైద్య సంరక్షణ, రోజువారీ ఖర్చుల కోసం అక్కడ నివశిస్తున్న మనవాళ్లు తరచూ నగదు బదిలీ చేస్తుంటారు. అంతేకాకుండా ముంబై, హైదరాబాద్, కొచ్చి వంటి నగరాల్లో ఎన్ఆర్ఐకు రియల్ ఎస్టేట్, మార్కెట్ పెట్టుబడులకు కూడా డబ్బు వస్తూ ఉంటుంది.






