బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఉగ్రవాద సంస్థగా గుర్తించిన యూఎస్

by Phanindra |

బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఉగ్రవాద సంస్థగా యూఎస్ గుర్తించింది. దీనికి చెందిన మజీద్ బ్రిగేడ్‌ను కూడా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్‌గా ప్రకటించింది.

బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఉగ్రవాద సంస్థగా గుర్తించిన యూఎస్
X

దిశ, నేషనల్ బ్యూరో: బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ), దానికి చెందిన మజీద్ బ్రిగేడ్‌ను విదేశీ ఉగ్రవాద సంస్థలుగా యూఎస్ ప్రకటించింది. బీఎల్‌ఏకు గతంలో ఇచ్చిన స్పెషల్లీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ (ఎస్‌‌డీజీటీ) క్లాసిఫికేషన్‌లో మజీద్ బ్రిగేడ్‌ను కూడా చేర్చుతున్నట్లు వెల్లడించింది. ‘2019 నుంచి ఎన్నో దాడులకు బీఎల్‌ఏ బాధ్యత తీసుకుంది. వీటిలో మజీద్ బ్రిగేడ్ చేసిన దాడులు కూడా ఉన్నాయి’ అని యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రుబియో పేర్కొన్నారు.

బీఎల్‌ఏపై ఎప్పటి నుంచో దృష్టి పెట్టిన యూఎస్.. 2019లో దీన్ని ఎస్‌డీజీటీగా గుర్తించింది. 2024లో కరాచీ ఎయిర్‌పోర్ట్, గ్వాదర్ పోర్ట్ అథారిటీ కాంప్లెక్స్‌లో జరిగిన ఆత్మాహుతి దాడులు, 2025లో జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేయడం తదితర ఎటాక్స్‌ తామే చేసినట్లు బీఎల్‌ఏ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘ఇలాంటి దాడులు ప్రజా సంక్షేమానికి, ఈ ప్రాంతలో శాంతికి ముప్పుగా మారాయి’ అని యూఎస్ పేర్కొంది.

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ట్రంప్ ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఈ నిర్ణయమే నిదర్శనమని యూఎస్ తెలిపింది. ఇలా ఉగ్రవాద గుర్తింపు ఇవ్వడం వల్ల టెర్రరిస్టుల కార్యకలాపాలకు మద్దతు తగ్గుతుందని వెల్లడించింది.

Next Story