అమెరికాకు త్వరలో అధికార భాష

by Ajay Maddhiboyina |

ట్రంప్ ఎన్నికల ప్రచార సమయంలోనే దేశంలో ప్రవేశిస్తున్న ఇతర భాషలపై మండిపడ్డారు. ఈ దేశంలో ఎవరూ వినని, ఎవరికీ తెలియని అనేక భాషలు వాడుతున్నారు.

అమెరికాకు త్వరలో అధికార భాష
X

- ఇంగ్లీషును అధికార భాషగా గుర్తిస్తూ ట్రంప్ ఉత్తర్వులు!

- 250 ఏళ్లుగా అధికార భాష లేని అమెరికా

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాకు రెండో సారి అధ్యక్షడు అయిన తర్వాత ఎన్నో కీలక, సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మరో ఉత్తర్వుపై సంతకం చేయనున్నారు. ఫెడరల్ స్థాయిలో అమెరికాకు ఇప్పటి వరకు ఎలాంటి అధికార భాష లేదు. అందుకే ఇకపై ఇంగ్లీష్‌ను అధికారిక భాషగా గుర్తిస్తూ ట్రంప్ త్వరలో ఉత్తర్వులపై సంతకాలు చేస్తారని వైట్ హౌస్ అధికారులను ఉటంకిస్తూ వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రచురించింది. అయితే ట్రంప్ ఎప్పుడు ఈ ఉత్తర్వుపై సంతకం చేస్తారనేది మాత్రం వెల్లడించలేదు. అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు భాషలు మాట్లాడుతుంటారు. అమెరికాకు ఎప్పటి నుంచో వలసదారులు వస్తున్నారు. ఈ క్రమంలో వందలాది భాషలు అమెరికాలో వాడుకలో ఉన్నాయి. 250 ఏళ్ల అమెరికా చరిత్రలో జాతీయ స్థాయిలో అధికార భాష లేదు. అయితే కొన్ని ప్రాంతాల్లో స్పానిష్ వాడకం ఎక్కువగా ఉంది.

2014లో శాసన సభలో విచారణ సందర్భంగా వలసదారుల హక్కుల గురించి ఒక కార్యకర్త స్పానిష్ భాష మాట్లాడుతుండగా ఒక సెనేటర్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాడు. స్పానిష్ కాకుండా ఇంగ్లీష్ మాట్లాడాలని డిమాండ్ చేశాడు. కాగా, టెక్సాస్‌లో స్పానిష్ మాట్లాడటం ఎప్పటి నుంచో ఉంది. గతంలో టెక్సాస్.. స్పానిష్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. అందుకే ఆ రాష్ట్రంలో స్పానిష్ సాధారణంగా వాడుతుంటారు. అయితే 1950ల్లో పాఠశాలల్లో స్పానిష్ మాట్లాడినందుకు శిక్షలు విధించారు. అప్పుడే టెక్సాస్‌లోని మెక్సికన్, అమెరికన్లుకు మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో 2000 అగస్టులో అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఒక ఉత్తర్వు జారీ చేశారు. దీని ప్రకారం ఫెడరల్ ఏజెన్సీలు, ఫెడరల్ నిధులు పొందే ఇతర సంస్థలు ఇంగ్లీష్ భాష కాకుండా ఇతర భాషల్లో సేవలు అందించేందుకు అనుమతి ఇచ్చారు. ఇక ఇప్పుడు ట్రంప్ కనుక ఇంగ్లీష్‌ను అధికార భాషగా చేస్తే.. అమెరికాలోని ఏ రాష్ట్రం కూడా వేరే భాషలను వాడే అవకాశం ఉండదు.

ట్రంప్ ఎన్నికల ప్రచార సమయంలోనే దేశంలో ప్రవేశిస్తున్న ఇతర భాషలపై మండిపడ్డారు. ఈ దేశంలో ఎవరూ వినని, ఎవరికీ తెలియని అనేక భాషలు వాడుతున్నారు. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి.. దీన్ని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లీష్‌ను అధికార భాషగా చేస్తూ ఉత్తర్వులు జారీ చేయనున్నారు.

Next Story