- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాగి బుక్కయితే దేశబహిష్కరణ.. వలసదారులే టార్గెట్‌గా యూఎస్ కొత్త చట్టం!
తాగి డ్రైవింగ్ చేస్తూ బుక్కయితే దేశబహిష్కరణ విధించాలని యూఎస్ భావిస్తోంది. దీనికోసం వలసదారులే టార్గెట్‌గా కొత్త చట్టం తెస్తోంది.

దిశ, నేషనల్ బ్యూరో: యూఎస్‌లో నివశించే వలసదారులపై ట్రంప్ సర్కారు కొరడా ఝుళిపించనుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ లేదా డ్రైవింగ్ అండర్ ఇన్‌ఫ్లుయెన్స్ (డీయూఐ) కేసుల్లో బుక్ అయిన వారిని వెంటనే దేశం నుంచి బహిష్కరించేందుకు సిద్ధమవుతోంది. దీని కోసం కొత్తగా చట్టాన్ని తెచ్చేందుకు ట్రంప్ సర్కారు నడుంబిగించింది. దీనికి సంబంధించిన ప్రొటెక్ట్ అవర్ కమ్యూనిటీస్ ఫ్రం డీయూఐస్ చట్టానికి వైట్‌హౌస్‌లోని ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ విభాగం మద్దతు తెలిపింది. ఈ బిల్లుకు యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్ కూడా జులై చివర్లో ఆమోదముద్ర వేసింది. తాజాగా ఈ బిల్లును సెనేట్ జ్యుడీషియరీ కమిటీకి పంపారు. ట్రంప్ ఫుల్ సపోర్ట్ ఇస్తున్న ఈ బిల్లుకు మిగతా రిపబ్లికన్ల నుంచి కూడా మద్దతు పెరుగుతోందని సమాచారం.
ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే.. గ్రీన్‌కార్డు, వివిధ వీసాలతో యూఎస్‌లో ఉంటున్న అందరిపై తీవ్రమైన ప్రభావం చూపనుంది. ఈ చట్టం ప్రకారం, భవిష్యత్తులో నమోదయ్యే డీయూఐ కేసులే కాకుండా, గతంలో ఎప్పుడైనా డీయూఐ కేసు బుక్ అయి ఉన్నా సరే.. అలాంటి వారిని దేశం నుంచి బహిష్కరిస్తారు. పదేళ్లు, ఇరవై ఏళ్ల క్రితం నమోదైన కేసులు కూడా బహిష్కరణకు కారణం అవుతాయి. ఈ చట్టం వస్తే పాత రికార్డుల్లోని డీయూఐ కేసులు తవ్వి తీసి, తమను దేశం నుంచి బహిష్కరిస్తారని యూఎస్‌లో చట్టప్రకారం నివశిస్తున్న వలసదారులు ఆందోళన చెందుతున్నారు.
చట్టం వచ్చినప్పుడు వేరే దేశంలో ఉంటే?
అంతేకాదు, గతంలో డీయూఐ కేసులు ఎదుర్కొన్న వలసదారులు విదేశాల్లో ఉన్నప్పుడు ఈ చట్టం వస్తే.. సదరు వ్యక్తులను మళ్లీ యూఎస్‌లోకి రానివ్వరు. ఈ చట్టం ప్రకారం యూఎస్ నుంచి బహిష్కరించేందుకు డీయూఐ కేసుల్లో శిక్ష పడాల్సిన అవసరం కూడా లేకపోవడం గమనార్హం. ప్లీ డీల్స్ చేసుకున్నా, కేసు కొట్టేసినా సరే వలసదారులను బహిష్కరించే అవకాశం ఉంది. యూఎస్‌కు వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే డీయూఐ కేసు బుక్ అయితే చాలు, వారు మారారా? ఇప్పుడు ఎలాంటి జీవనం సాగిస్తున్నారు? అనే అంశాలన్నీ పక్కన పెట్టేసి, సదరు వ్యక్తిని దేశం నుంచి బహిష్కరించడం సరికాదని నిపుణులు అంటున్నారు.
పద్ధతులు వదిలేయడమే..
‘ఈ బిల్లు వెనుక ఉన్న కారణం మంచిదే. కానీ ఒక పద్ధతి లేకుండా.. రీహాబిలేషన్ వంటి విధానాలను వదిలేసి దేశం నుంచి బహిష్కరించడం సరికాదు’ అని న్యాయనిపుణులు వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే యూఎస్ పౌరసత్వం పొందే అర్హత ఉన్న వారు వెంటనే దరఖాస్తులు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే ఈ చట్టం నుంచి కొంత రక్షణ ఉండే అవకాశం ఉందంటున్నారు. యూఎస్‌లో రెండో అతిపెద్ద విదేశీ కమ్యూనిటీ అయిన భారతీయుల్లో కూడా ఈ బిల్లు టెన్షన్ పెంచుతోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్ వ్యవస్థను కఠినతరం చేయడంతో ఇప్పటికే సమస్యలు ఎదుర్కొంటున్న వారు.. ఎప్పుడో చేసిన చిన్న పొరపాటు వల్ల తమ జీవితాలు అతలాకుతలం అయిపోతాయని ఆందోళన చెందుతున్నారు.






