ఆ దేశాల వారికి గ్రీన్‌కార్డులు కట్? ట్రంప్ సర్కారు కొత్త ప్రతిపాదన?

by Phanindra |

ఆ దేశాల వారికి గ్రీన్‌కార్డులు కట్ చేయబోతున్నారా? ట్రంప్ సర్కారు కొత్త ప్రతిపాదనతో ఆందోళనలో వలసదారులు.

ఆ దేశాల వారికి గ్రీన్‌కార్డులు కట్? ట్రంప్ సర్కారు కొత్త ప్రతిపాదన?
X

దిశ, నేషనల్ బ్యూరో: వలసదారులపై కఠిన వైఖరి వహిస్తున్న అమెరికా ప్రభుత్వం మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని దేశాలకు చెందిన వలసదారులకు ఇచ్చే గ్రీన్‌కార్డులు, ఇతర సదుపాయాలను కట్టడి చేయాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం యోచిస్తోందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీకి చెందిన కొన్ని పత్రాలు వెల్లడిస్తున్నాయి. అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన తర్వాత 12 దేశాల నుంచి యూఎస్‌కు ఎవరూ రాకుండా ‘ట్రావెల్ బ్యాన్’ విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలా ట్రావెల్ బ్యాన్ విధించిన దేశాలకు చెందిన వలసదారులకు గ్రీన్‌కార్డు, ఇతర ఇమిగ్రేషన్ సదుపాయాలను కట్టడి చేసేందుకు ట్రంప్ సర్కారు కొత్త చట్టం చేస్తోందట. అయితే ఈ దేశాల జాబితాలో భారత్ లేదు.

ఇంకా ఫైనలైజ్ చెయ్యని ఈ ప్రతిపాదనతో వలసలపై ట్రంప్ సర్కారు కఠిన వైఖరి మరోసారి తేటతెల్లమైందని విశ్లేకులు అంటున్నారు. ఈ నిర్ణయం కనుక అమలైతే.. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) వలసదారుల దరఖాస్తులను పరిశీలించే సమయంలో ఆయా దేశాలపై అమెరికా ఆంక్షలను సీరియస్‌గా పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. దీనిపై కొందరు మాజీ అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే యూఎస్‌లో స్థిరపడిన వారి జీవితాలను కూడా తలకిందులు చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, చట్టపరంగా అమెరికా వచ్చిన వారిపై ట్రంప్ సర్కారు తీవ్రంగా దాడులు చేస్తోందని మండిపడుతున్నారు.

ఈ కొత్త చట్టం తీసుకొస్తే.. అమెరికా ప్రభుత్వం ‘ట్రావెల్-బ్యాన్’ విధించిన దేశాలకు చెందిన వలసదారుల దరఖాస్తులకు యూఎస్‌సీఐఎస్ ఆటోమేటిక్‌గా నెగిటివ్ మార్కులు వేస్తుంది. గ్రీన్‌కార్డులు, శరణార్థుల అప్లికేషన్లు, పరోల్, ఇతర ఇమిగ్రేషన్ సంబంధిత సదుపాయాలకు ఇది వర్తిస్తుంది. అయితే సిటిజన్‌షిప్ దరఖాస్తులకు ఇది వర్తించదని సమాచారం. ఇంతకాలం కమ్యూనిటీతో దరఖాస్తుదారుల సంబంధాలు, క్రిమినల్ రికార్డులు, మానవతా దృక్పథంలో వారి అవసరాలు తదితర అంశాలను అధికారులు పరిశీలించేవారు. ట్రంప్ సర్కారు కొత్త ప్రతిపాదన ప్రకారం, దరఖాస్తుదారులు ఏ దేశానికి చెందిన వారు? ఆ దేశంతో యూఎస్‌కు రిస్క్ ఉందా? వంటి అంశాలను కూడా పరిశీలించాల్సి వస్తుంది.

Next Story