Ukraine: ఉక్రెయిన్ లోని భూగర్భ ఖనిజాలపై అమెరికా కన్ను..!

by Shamantha N |

ఉక్రెయిన్‌ లో భూగర్భ ఖనిజాలపై అమెరికా కన్ను పడింది. ఖనిజాల వెలికితీత విషయంపై అమెరికా- కీవ్ మధ్య ఒప్పందం కుదర్లేదు.

Ukraine: ఉక్రెయిన్ లోని భూగర్భ ఖనిజాలపై అమెరికా కన్ను..!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్‌ లో భూగర్భ ఖనిజాలపై అమెరికా కన్ను పడింది. ఖనిజాల వెలికితీత విషయంపై అమెరికా- కీవ్ మధ్య ఒప్పందం కుదర్లేదు. కాగా.. ఇలాంటి సమయంలో కీవ్ ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరించినట్లు తెలుస్తోంది. ఖనిజాలకు సంబంధించి ఒక ఒప్పందం కుదుర్చుకోకుంటే.. స్టార్ లింక్ సేవలు నిలిపివేస్తామని బెదిరించినట్లు సమాచారం. రష్యా దాడి మొదలైన దగ్గరి నుంచి ఉక్రెయిన్‌లో బిలియనీర్, స్పేస్ ఎక్స్ అధినేత, ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌ (Starlink) సంస్థ నిరంతరాయంగా సేవలు అందిస్తోంది. ఇది కీవ్ బలగాలకు ఎంతో ఉపయోగపడుతోంది. ఇటీవల ఉక్రెయిన్‌లో యూఎస్‌ దౌత్యవేత్త, జెలెన్‌స్కీ(Zelensky) మధ్య జరిగిన సమావేశంలో ఈ అంశం గురించి ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ అమెరికా బెదిరించినట్లు స్టార్ లింక్ సేవలు నిలిపివేస్తే.. అది ఉక్రెయిన్ కి పెద్ద షాక్ గా మారనుంది. ‘‘స్టార్‌ లింక్‌పై ఉక్రెయిన్‌ నడుస్తోంది. అది దూరమైతే జెలెన్‌స్కీకి పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది’’ అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

500 బిలియన్ డాలర్ల డీల్

ఉక్రెయిన్‌లో ఉన్న అరుదైన భూగర్భ ఖనిజాలు వెలికితీసేందుకు గాను ఆ దేశంతో ట్రంప్‌ 500 బిలియన్‌ డాలర్ల మేరకు డీల్‌ను ప్రతిపాదించినట్లు సమాచారం. ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాలతోపాటు చమురు, గ్యాస్‌, పోర్టులు, మౌలిక సదుపాయాలు సహా ఆ దేశంలోని సగభాగం సహజ వనరులపై తమకు ఆధిపత్యం ఇవ్వాలని అమెరికా కోరింది. అయితే, ఈ డీల్ కుదిరితే కీవ్ నుంచి కోరుతున్న సంపద మొత్తం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ, జపాన లపై విధించిన ఆంక్షల కన్నా ఎక్కువ అని బ్రిటన్‌కు చెందిన ఓ వార్తాపత్రిక పేర్కొంది. ఈ ఒప్పందం కుదిరితే.. ఉక్రెయిన్‌లో భవిష్యత్ పెట్టుబడి ప్రాజెక్టుల నిబంధనలను నిర్ణయించడంలో అమెరికన్ ఫండ్ నియంత్రణ సాధించే అవకాశం ఉందని తెలిపింది. అందుకే, జెలెన్ స్కీ ఈ ఆఫర్ తిరస్కరించాడంది. ఇలాంటి సమయంలో ఖనిజ సంపదలో అమెరికాకు వాటే ఇచ్చేందుకు త్వరలోనే కీవ్ అంగీకారం తెలిపే అవకాశం ఉందని ట్రంప్ ఇటీవలే అన్నారు. ఈనేపథ్యంలో ఇలాంటి వార్తలు రావడం గమనార్హం.

Next Story