- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రష్యా చమురు కొంటే 500 శాతం సుంకాలు.. భారతే టార్గెట్?
రష్యా చమురు కొంటే 500 శాతం సుంకాలు వేసేందుకు యూఎస్ రెడీ అవుతోంది. దీని టార్గెట్ భారతే అని సమాచారం.

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా నుంచి చమురు, యురేనియం కొంటూ ఉక్రెయిన్‌లో ఆ దేశం యుద్ధానికి సహకరిస్తున్న దేశాలపై 500 శాతం సుంకాలు వేసేందుకు అమెరికా కొత్త చట్టం తెస్తోంది. రష్యా ఆంక్షల బిల్లు కనుక చట్టరూపం దాలిస్తే భారత్, చైనా, బ్రెజిల్ తదితర దేశాలపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది. గ్రాహమ్-బ్లూమెంథల్ ఆంక్షల బిల్లుగా నామకరణం చేసిన ఈ చట్టంతో రష్యా నుంచి కొనుగోలు చేయడం వల్ల పుతిన్ చేసే యుద్ధాలకు ఫండింగ్ దొరుకుతుందని తెలిసీ, కొనుగోళ్లు చేసే దేశాలపై 500 శాతం వరకు పన్నులు వేసే అధికారం ట్రంప్‌కు దక్కుతుంది. ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి ఒప్పందం కోసం యూఎస్ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో.. పుతిన్ సర్కారును ఆర్థికంగా దెబ్బతీసేందుకే అమెరికా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
ఈ రష్యా ఆంక్షల బిల్లుకు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా మద్దతిచ్చారని రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్ చెప్పారు. వైట్‌హౌస్‌లో ట్రంప్‌ను కలిసిన ఆయన ఈ బిల్లు గురించి వివరించారు. ‘ఇది సరైన సమయంలో వస్తున్న బిల్లు. ఎందుకంటే శాంతి కోసం ఉక్రెయిన్ కొన్ని త్యాగాలు చేయడానికి సిద్ధం అవుతోంది. కానీ రష్యా మాత్రం కేవలం మాటలకే పరిమితమై, అమాయకులను చంపుతోంది’ అని గ్రాహమ్ అన్నారు. వచ్చే వారమే ఈ బిల్లుపై ఓటింగ్ నిర్వహించే అవకాశం ఉందని ఆయన చెప్పినప్పటికీ.. వచ్చే వారం సెనేట్‌లో ప్రభుత్వ ఫండింగ్ ప్యాకేజీపై చర్చ జరిపేందుకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో ఇది సాధ్యం కాకపోవచ్చని అధికారులు చెప్తున్నారు. ఆ తదుపరి వారంలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ డే కారణంగా సెనేట్‌కు విరామం ఇస్తారని తెలుస్తోంది. కాబట్టి రష్యా ఆంక్షల బిల్లు చర్చకు రావాలంటే కనీసం మూడు వారాలు సమయం పట్టే అవకాశం ఉంది.
భారత్‌కే సమస్య?
రష్యా నుంచి చమురు, యురేనియంను యూరప్‌కు చెందిన కొన్నిదేశాలు, చైనా కొంటున్నాయి. భారత్, బ్రెజిల్ ప్రధానంగా రష్యా చమురునే కొంటున్నాయి. అయితే చైనాతో ప్రత్యేకంగా యూఎస్‌కు వాణిజ్య పోరు నడుస్తున్న నేపథ్యంలో కొత్త బిల్లు తెచ్చినా డ్రాగన్ దేశంపై యూఎస్ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేకపోవచ్చు. ఎందుకంటే యూఎస్ కనుక చైనాపై సుంకాలు వేస్తే.. చైనా కూడా అదే స్థాయిలో యూఎస్‌పై సుంకాలు వేసే చాన్స్ ఉంది. యూరప్ దేశాలపై కూడా యూఎస్ పెద్దగా ఫోకస్ పెట్టకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం కేవలం భారత్, బ్రెజిల్ మీదనే యూఎస్ 50 శాతం సుంకాలు విధిస్తోంది. తాజాగా వెనిజులాపై యూఎస్ సైనిక చర్య తర్వాత బ్రెజిల్ కూడా రష్యాతో డీల్ నుంచి వెనక్కు తగ్గే అవకాశాలున్నాయని నిపుణుల అంచనా. దీంతో ఈ బిల్లు కనుక చట్టరూపం దాలిస్తే.. ప్రధానంగా భారత్ మీదనే ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అంటున్నారు.
యూఎస్ నౌకలు ముంచేయాలి..
రష్యాకు చెందిన ‘మరినెరా’ అనే ఓడను యూఎస్ దళాలు సీజ్ చేయడంపై మాస్కో మండిపడింది. ఈ క్రమంలోనే రష్యా చట్టసభ సభ్యుడు అలెక్సీ జురావ్లేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా కనుక ఇలాంటి చర్యలు కొనసాగిస్తే మిలిటరీ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. రష్యా ఈ చర్యలపై కఠినంగా స్పందించాలన్న ఆయన.. ‘టోర్పెడోలతో కొన్ని అమెరికన్ కోస్ట్ గార్డ్ నౌకలు ముంచేయాలి. మామూలుగానే వాళ్లు యూఎస్ తీరం నుంచి వేల కిలోమీటర్ల వరకు కాపలా కాస్తుంటారు కదా’ అని చెప్పారు. వెనిజులాపై మిలిటరీ చర్య సక్సెస్ కావడంతో ప్రస్తుతం అమెరికా ఏం చేసినా చెల్లుతుందనే మూడ్‌లో ఉందని, ఇలా కొన్ని ఓడలు ముంచేస్తేనే మళ్లీ వాస్తవ ప్రపంచంలోకి యూఎస్ తిరిగొస్తుందని వివరించారు.
రష్యా నౌకలో ముగ్గురు భారతీయులు?
మరినెరా నౌకను సీజ్ చేసిన యూఎస్.. ఆ నౌకలో పనిచేస్తున్న సిబ్బందిపై కేసులు పెడతామని ప్రకటించింది. ఈ నౌకలో మొత్తం 28 మంది సిబ్బంది ఉన్నారని అధికారులు చెప్తున్నారు. వీరిలో ముగ్గురు భారతీయులు కూడా ఉన్నట్లు సమాచారం. తమ సిబ్బందిని గౌరవంగా చూసుకోవాలని, విదేశీయులను వెంటనే వదిలిపెట్టేయాలని అమెరికా ప్రభుత్వాన్ని రష్యా కోరింది. ఈ నౌకలోని సిబ్బందిలో 17 మంది ఉక్రేనియన్లు, ఆరుగురు జార్జియన్లు, ముగ్గురు భారతీయులు, ఇద్దరు రష్యన్లు ఉన్నారని తెలుస్తోంది.






