- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు.. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆదేశాలకు ఊరట
అమెరికా అధ్యక్షుడి ఆదేశాలపై పలు రాష్ట్రాల్లోని న్యాయస్థానాలు జారీ చేస్తున్న తాత్కాలిక నిలిపివేతలకు పెద్ద దెబ్బ తగిలింది.

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడి ఆదేశాలపై పలు రాష్ట్రాల్లోని న్యాయస్థానాలు జారీ చేస్తున్న తాత్కాలిక నిలిపివేతలకు పెద్ద దెబ్బ తగిలింది. ట్రంప్ అడిగిన అంశంపై విచారణ చేసిన అమెరికా సుప్రీం కోర్టు, వ్యక్తిగత జిల్లా న్యాయమూర్తులకు జాతీయ స్థాయిలో అమలయ్యే ఇంజంక్షన్లు జారీ చేసే అధికారం లేదని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ట్రంప్‌కు ఊరట లభించినట్టు మార్మోగుతోంది.
మొదటి రోజు పదవిలోకి వచ్చిన ట్రంప్.. అమెరికాలో అక్రమ వలసదారులు లేదా తాత్కాలిక వీసాలతో ఉన్న వారి పిల్లలకు పౌరసత్వం లభించదని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో అక్కడి కోర్టులు ఆ ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ దేశవ్యాప్తంగా ప్రభావం చూపే ఆదేశాలు జారీ చేశాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ అమెరికా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఎగ్జిక్యూటివ్ శాఖను న్యాయవ్యవస్థ అడ్డుకుంటోందని ఆయన వాదించారు. విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు, కోర్టులు తమ పరిధిని మించి దేశవ్యాప్తంగా అమలయ్యే ఇంజంక్షన్లు ఇవ్వకూడదని తీర్పు ఇచ్చింది. అయితే జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ట్రంప్ జారీ చేసిన ఆదేశాల చట్టబద్ధతపై మాత్రం సుప్రీం కోర్టు తుది నిర్ణయం ఇవ్వలేదు.
అమెరికాలో 1868లో అమలులోకి వచ్చిన 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం, ఆ దేశంలో జన్మించిన వారందరికీ పౌరసత్వం లభిస్తుంది. ఈ నిబంధన వలసదారుల పిల్లలకు కూడా పౌర హక్కులను కల్పిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా, కెనడా, మెక్సికో సహా 30కి పైగా దేశాల్లో జన్మతః పౌరసత్వ విధానం అమలులో ఉంది. అయితే ట్రంప్ ఆదేశాల నేపథ్యంలో అమెరికాలో ఈ వ్యవస్థను తిరగరాస్తే అవకాశం ఉందని భావిస్తున్నారు.






