ఉక్రెయిన్ యుద్దంపై సౌదీలో చర్చలు

by Ajay Maddhiboyina |

రాబోయే రోజుల్లో సౌదీ అరేబియా వేదికగా అమెరికా, రష్యాకు చెందిన అత్యున్నత స్థాయి అధికారులు ఉక్రెయిన్ యుద్దంపై చర్చలు జరపనున్నారు.

ఉక్రెయిన్ యుద్దంపై సౌదీలో చర్చలు
X

- సమావేశం కానున్న యూఎస్, రష్యా అధికారులు

- యూరోప్‌కు అందని ఆహ్వానం

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్ యుద్దానికి ముగింపు పలుకుతానని చెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దిశగా చర్యలు చేపట్టారు. రాబోయే రోజుల్లో సౌదీ అరేబియా వేదికగా అమెరికా, రష్యాకు చెందిన అత్యున్నత స్థాయి అధికారులు ఉక్రెయిన్ యుద్దంపై చర్చలు జరపనున్నారు. ఈ మేరకు చర్చలకు సంబంధించిన విషయాలను చూస్తున్న కీలక వ్యక్తి తెలిపారు. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్ట్జ్, వైట్ హౌస్ మిడిల్ ఈస్ట్ రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ చర్చల కోసం సౌదీ అరేబియాకు వెళతారని అమెరికా ప్రతినిధి మైఖేల్ మెక్‌కౌల్ తెలిపారు. అయితే వీరు సౌదీ అరేబియాలో కలిసే రష్యన్ ప్రతినిధులు ఎవరో మాత్రం చెప్పలేదు. మ్యూనిక్‌లో జరుగుతున్న సెక్యూరిటీ కాన్ఫరెన్స్ సందర్భంగా మెక్‌కౌల్ మాట్లాడుతూ ఉక్రెయిన్ యుద్దం ఆపి, అక్కడ శాంతిని నెలకొల్పడానికి యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్‌తో పాటు జెలెన్‌స్కీతో చర్చలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అయితే శాంతి చర్చల కోసం సౌదీ అరేబియాలో జరుగనున్న సమావేశానికి తనను పిలవలేదని యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమీర్ జెలన్‌స్కీ అడిగిన తర్వాత రోజే ఈ విషయం వెలుగు చూడటం గమనార్హం.

Next Story