అమెరికా ప్రతీకార దాడులు.. వదిలి వెళ్లాలంటూ ఇరాన్ హెచ్చరిక

by Prasad Jukanti |   (  Updated:2026-06-10 01:39:27  IST  )

అపాచీ హెలికాప్టర్ కూల్చివేతకు ప్రతీకారంగా ఇరాన్‌పై అమెరికా దాడులు ప్రారంభించింది. సురక్షితంగా ఉండాలంటే తమ ప్రాంతం వదిలి వెళ్లాలని ఇరాన్ యూఎస్‍ను హెచ్చరించింది.

అమెరికా ప్రతీకార దాడులు.. వదిలి వెళ్లాలంటూ ఇరాన్ హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత కొన్ని రోజులుగా యుద్ధానికి విరామం ఇచ్చిన అమెరికా -ఇరాన్ మధ్య మళ్లీ చిచ్చు రాజుకుంది. హర్మూజ్‌ సమీపంలో అమెరికా అపాచీ హెలికాప్టర్‌ కూలిపోయిన ఘటనకు సంబంధించి ఇరాన్‌పై యూఎస్‌ ప్రతీకార దాడులకు దిగింది. తమ హెలికాప్టర్ కూల్చేసినందుకు ప్రతీకారం తప్పదని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించినట్లుగానే యూఎస్ మిలటీరీ దాడులు మొదలు పెట్టింది. అయితే ఈ దాడులపై ఇరాన్ ఘాటుగా రియాక్ట్ అయింది. అమెరికా చేస్తున్న దాడులకు తప్పకుండా బదులిస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి అమెరికాను హెచ్చరించారు. ఎక్స్ వేదికగా పోస్టు చేసిన అబ్బాస్.. "యుద్ధరంగంలో పరాజయాలు ఎదురైనప్పటికీ అమెరికా మా సంకల్పాన్ని పరీక్షించాలని చూస్తోంది. మా శక్తివంతమైన సాయుధ దళాలు ఏ దాడిని లేదా ముప్పును వదిలిపెట్టవు. మీరు సురక్షితంగా ఉండాలనుకుంటే మా ప్రాంతాన్ని విడిచి వెళ్ళండి. చొరబాటుదారులకు పట్టిన ఘోరమైన గతుల గురించి పర్షియన్ గల్ఫ్ చరిత్రలో ఎన్నో అధ్యాయాలు ఉన్నాయి" అని రాసుకొచ్చారు.

చిచ్చు పెట్టిన హెలికాప్టర్:

కాగా ఒమన్ తీరం వెంబడి హర్మూజ్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున గస్తీ నిర్వహిస్తున్న యూఎస్ మిలటరీ హెలికాప్టర్ ఏహెచ్-64 అపాజీ కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఇరాన్ డ్రోన్ దాడి కారణంగానే తమ హెలికాప్టర్ కూలిపోయిందని అమెరికా దర్యాప్తులో తేలింది. దీంతో ఇరాన్ పై ప్రతీకార దాడులు తప్పవని ట్రంప్ హెచ్చరించగా బుధవారం హర్మూజ్‌ సమీపంలోని ఖేష్మ్‌ దీవిలో అమెరికా బాంబులతో విరుచుకుపోడినట్లు ఇరాన్‌ మీడియా వెల్లడించింది. ఇప్పటికే ఈ ఇరు దేశాల మధ్య నెలకొన్న ఘర్షణవాతావరణం వల్ల ప్రపంచ దేశాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అవుతున్నాయి. ఇటువంటి తరుణంలో యూఎస్-ఇరాన్ మధ్య మళ్లీ దాడులు, ప్రతిదాడులు మొదలు కావడం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.

Next Story