Trump: ట్రంప్ పశ్చిమాసియా టూర్ స్టార్ట్

by Shamantha N |

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పశ్చిమాసియా పర్యటన చేపట్టారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ పర్యటనలో భాగంగా తొలుత ఆయన సౌదీ అరేబియాకు చేరుకొన్నారు.

Trump: ట్రంప్ పశ్చిమాసియా టూర్ స్టార్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పశ్చిమాసియా పర్యటన చేపట్టారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ పర్యటనలో భాగంగా తొలుత ఆయన సౌదీ అరేబియాకు చేరుకొన్నారు. ఆయనకు యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ స్వాగతం పలికారు.ఆయన సౌదీ, యూఏఈ, ఖతార్‌ లలో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం ఆయన విమానం రియాద్‌కు చేరుకొంది. ట్రంప్‌ వెంట అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌, వాణిజ్య మంత్రి హోవర్డ్‌ లుట్నిక్‌, ఇంధనశాఖ మంత్రి క్రిస్‌ రైట్‌ ఉన్నారు. ట్రంప్‌ కోసం ఏర్పాటు చేసిన విందులో పలు కంపెనీల సీఈవోలు పాల్గొననున్నారు. గాజాలో యుద్ధం, ఇరాన్ అణు కార్యకలాపాల ముప్పు సహా పలు భద్రతా సంక్షోభాలు, ఆర్థిక ఒప్పందాలపై ఈ పర్యటనలో ట్రంప్ దృష్టి సారించనున్నారు. మరోవైపు, తాను తుర్కియేకు కూడా వెళ్లే అవకాశం ఉన్నట్లు ట్రంప్‌ స్వయంగా వెల్లడించారు. ఈ నెల 15 నుంచి ఉక్రెయిన్‌, రష్యా మధ్య చర్చలు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో పుతిన్‌, జెలెన్‌స్కీతో నేరుగా చర్చించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా, ట్రంప్‌ రెండో సారి అధికారం చేపట్టిన తర్వాత చేపట్టిన తొలి పెద్ద పర్యటన ఇదే.

విలువైన బోయింగ్ గిఫ్ట్..

మరోవైపు, ట్రంప్ కు ఖతార్‌ రాజకుటుంబం అత్యంత విలువైన బోయింగ్‌ 737 విమానం గిఫ్ట్‌గా ఇవ్వనుందని వార్తలొస్తున్నాయి. దాదాపు 400 మిలియన్ డాలర్ల విలాసవంతమైన విమానాన్ని కానుకగా అందించనున్నట్లు వస్తున్న ఆ వార్తలు నిజమే అని ట్రంప్ హింట్ కూడా ఇచ్చారు. అయితే, ఆ బహుమతి తీసుకోవడం అనైతికం.. అనే అంశాన్ని ఆయన కొట్టిపారేశారు. ‘‘అంత ఉదారంగా ఖతర్‌ రాజకుటుంబం ఇచ్చే బహుమతిని వద్దనడానికి నేను మూర్ఖుడిని కాదు’’ అని పశ్చిమాసియా పర్యటనకు వెళ్లే ముందు మీడియాతో అన్నారు. దీనిని ఎయిర్‌ ఫోర్స్‌వన్‌ కింద వాడుకోవాలని ట్రంప్‌ ఆలోచిస్తున్నారు. చివర్లో దీనిని ప్రెసిడెన్షియల్‌ లైబ్రరీకి ఇచ్చేస్తానన్నారు. వ్యక్తిగత అవసరాలకు వాడుకొనే ఉద్దేశం లేదని తేల్చిచెప్పారు. ఒకవేళ ఖతార్ రాజకుటుంబం ఆ విమాన్ని బహుమానంగా ఇచ్చినట్లయితే, ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షులకు అందిన అత్యంత విలువైన గిఫ్ట్ ఇదే కావొచ్చు. మరోవైపు ఖతార్‌ ప్రతినిధి మాత్రం తాము విమానం ఇస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం సరికాదన్నారు. తాత్కాలికంగా ఒక విమానాన్ని బదిలీ చేస్తామన్నారు.

Next Story