పెట్రోల్, డీజిల్ ధరలపై BIG అప్‌డేట్

by Prasad Jukanti |   (  Updated:2026-05-08 13:40:46  IST  )

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినా భారత్‌లో ధరలు స్థిరంగా ఉన్నాయి. దీనివల్ల చమురు సంస్థలు నెలకు రూ. 30,000 కోట్ల నష్టాన్ని భరిస్తున్నాయి.

పెట్రోల్, డీజిల్ ధరలపై BIG అప్‌డేట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పిరిగినా మన దేశంలో ధరలు స్థిరంగా ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు భారీగా నష్టం వాటిల్లినట్లు తాజాగా అధికారులు వెల్లడించారు. ఆయిల్ కంపెనీలు ఏకంగా రూ.30 వేల కోట్ల నష్టం భరిస్తున్నాయని తాజాగా పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చమురు సంస్థలు అంతర్జాతీయ మార్కెట్ నుండి ఖరీదైన ముడి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్నప్పటికీ, ప్రజలపై భారం పడకూడదనే ఉద్దేశంతో తక్కువ ధరకే విక్రయిస్తున్నట్లు పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ శుక్రవారం తెలిపారు. చమురు సంస్థలపై ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని, దీనివల్ల నెలకు రూ. 14,000 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోతోందని ఆమె వివరించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడి చమురు ధర 70 డాలర్ల నుండి ఏకంగా 120 డాలర్లకు పెరిగినప్పటికీ, భారత్‌లో ధరలు స్థిరంగా ఉన్నాయని పేర్కొన్నారు.

గ్యాస్ కొరత లేదు:

గత రెండు రోజుల్లోనే వినియోగదారులకు 97 లక్షల ఎల్పీజీ సిలిండర్లను సరఫరా చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఎక్కడా గ్యాస్ కొరత లేదని స్పష్టం చేసింది. పైప్‌డ్ నేచురల్ గ్యాస్ (PNG) కోసం దాదాపు 7 లక్షల మంది రిజిస్టర్ చేసుకోగా ఇప్పటికే 50 వేల మందికి పైగా తమ ఎల్పీజీ సిలిండర్లను వదులుకున్నారని స్పష్టం చేశారు. ఇంధన సరఫరాపై ఒత్తిడి ఉన్నప్పటికీ, ఎరువుల ప్లాంట్లకు 98 శాతం కేటాయింపులు జరుపుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. చమురు, గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టిందని వెల్లడించారు. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 200 ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన 41 మంది డిస్ట్రిబ్యూటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసి మరో 12 మందికి జరిమానా విధించామన్నారు. ఒక డిస్ట్రిబ్యూటర్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. దేశంలో పెట్రోల్, డీజిల్ రేషనింగ్ లేదా కొరత ఏమీ లేదని, రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని సుజాత శర్మ స్పష్టం చేశారు.

పెట్రోల్ ధరలు పెంపు?:

అయితే తాజాగా ఆయిల్ కంపెనీల నష్టాలను ప్రభుత్వం వెల్లడించడం రాజకీయ, వ్యాపార వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరగడంతో ఆ భారం ప్రజలపై పడకుండా పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. ఆయిల్ కంపెనీలపై భారం అనేది లేకుండా కేంద్రం లెవల్ చేస్తూ వచ్చింది. అయితే అనేక దేశాలు చమురు కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ధరలు పెంచడం అనివార్యం అని చర్చ జరుగుతోంది. అయితే, ఇటీవలే ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే ధరలు పెరుగుతాయని ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను కేంద్రం ఖండించింది. ఇదేసమయంలో ఎన్నికలు ముగియగానే కమర్షియల్ సిలిండర్ ధరలు ఊహించని రీతిలో పెంచేసింది. దీంతో పెరుగుతున్న ఆయిల్ కంపెనీల నష్టాలను భర్తీ చేసేందుకు ఇక పెట్రోల్, డీజిల్ తో పాటు డొమెస్టిక్ ఎల్పీజీ ధరలను సైతం పెంచబోతున్నారని అందులో భాగంగానే ముందస్తుగా ఆయిల్ సంస్థల నష్టాలను తెరపైకి తీసుకువస్తున్నారనే వాదన వినిపిస్తోంది. మరి ప్రచారం జరుగుతున్నట్లు నిజంగానే పెట్రోల్ ధరలు పెరగబోతున్నాయా లేదా అనేది కాలమే నిర్ణయించనుంది.

Next Story