అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు.. పాక్‌పై ఇరాన్ ఎంపీల సంచలన వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలమయ్యే దిశగా సాగుతున్నాయి.

అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు.. పాక్‌పై ఇరాన్ ఎంపీల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా-ఇరాన్ మధ్య శాంతిని నెలకొల్పేందుకు పాకిస్థాన్ (Pakistan) చేస్తున్న ప్రయత్నాలకు గండి పడింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ (Abbas Araghchi) ఇస్లామాబాద్‌లో పర్యటిస్తున్న తరుణంలో, మధ్యవర్తిగా పాకిస్థాన్ పాత్రను ఇరాన్ ఎంపీలు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. పాకిస్థాన్‌కు అటు అమెరికాను, ఇటు ఇరాన్‌ను ఒప్పించే సత్తా లేదని వారు వ్యాఖ్యానించడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. పాకిస్థాన్ (Iran) ఈ చర్చలను కేవలం తన ప్రాంతీయ ప్రాముఖ్యతను పెంచుకోవడానికి, అంతర్జాతీయ వేదికపై తన ఉనికిని చాటుకోవడానికే వాడుకుంటోందని ఇరాన్ ఎంపీలు కామెంట్ చేశారు. అమెరికా, ఇరాన్ మధ్య ఉన్న లోతైన విభేదాలను పరిష్కరించే సామర్థ్యం ఇస్లామాబాద్‌కు లేదని వారు తేల్చి చెప్పారు.

ట్రంప్ పర్యటన రద్దు.. నీరుగారిన చర్చలు

మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ (Araghchi) గత రెండు రోజుల్లో రెండుసార్లు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌లతో భేటీ అయ్యారు. అయితే, మరోవైపు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ప్రతినిధులు స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్ ఇస్లామాబాద్‌కు పంపే పర్యటనను అకస్మాత్తుగా రద్దు చేసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ చర్చలు జరపడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదని ట్రంప్ కామెంట్ చేయడం పాకిస్థాన్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలింది. ఇక శాంతి చర్చల మాట ఎలా ఉన్నా, వ్యూహాత్మక హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz)పై ఇరాన్ తన పట్టును సడలించేలా లేదు. ఇది తమ వద్ద ఉన్న అమ్ములపొదిలోని బలమైన అస్త్రమని, అమెరికా ఒత్తిడికి తలొగ్గి దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఇరాన్ ఎంపీలు స్పష్టం చేశారు.

Next Story