- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హార్ముజ్ జలసంధిలో యుద్ధ జ్వాలలు: ఇరాన్ క్షిపణి కేంద్రాలపై అమెరికా బాంబుల వర్షం!
అంతర్జాతీయ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు అమెరికా సైన్యం రంగంలోకి దిగింది.

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు అమెరికా సైన్యం రంగంలోకి దిగింది. ఇరాన్ తీరప్రాంతంలోని పటిష్టమైన క్షిపణి కేంద్రాలపై అమెరికా గగనతల దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో తన అమ్ములపొదిలోని అత్యంత శక్తివంతమైన 5,000 పౌండ్ల డీప్ పెనిట్రేటర్ (బంకర్ బస్టర్) బాంబులను ప్రయోగించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది. "హార్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ తీరంలో ఉన్న అత్యంత కఠినమైన క్షిపణి కేంద్రాలపై అమెరికా దళాలు విజయవంతంగా 5,000 పౌండ్ల భారీ బాంబులను ప్రయోగించాయి" అని సెంట్రల్ కమాండ్ 'X' వేదికగా ప్రకటించింది. ఈ కేంద్రాల్లో ఉన్న ఇరాన్ యాంటీ-షిప్ క్రూయిజ్ క్షిపణులు అంతర్జాతీయ షిప్పింగ్‌కు ముప్పుగా మారాయని అమెరికా పేర్కొంది.
చమురు రవాణాకు విఘాతం..
అమెరికా, ఇజ్రాయెల్‌లతో యుద్ధం నేపథ్యంలో ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేసింది. ప్రపంచ చమురు సరఫరాలో ఐదింట ఒక వంతు ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రపంచవ్యాప్తంగా సముద్ర రవాణా నిలిచిపోయి, ఇంధన ధరలు ఆకాశాన్ని తాకాయి. ఈ ప్రతిష్టంభనను తొలగించేందుకే అమెరికా ఈ దాడులకు పూనుకుంది.
ట్రంప్ పిలుపును తిరస్కరించిన మిత్రదేశాలు..
హార్ముజ్ జలసంధి రక్షణలో సహాయం చేయాలన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపును నాటో (NATO) సహా మెజారిటీ మిత్రదేశాలు తిరస్కరించాయి. దీనిపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాము నాటో దేశాలకు ఎంతో సహాయం చేసినప్పటికీ, ఇప్పుడు వారు కనీసం 'మైన్ స్వీపర్'లను కూడా పంపడానికి ముందుకు రావడం లేదని ఆయన విమర్శించారు. ప్రపంచం మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, ఈ యుద్ధాన్ని ప్రపంచ క్షేమం కోసమే చేస్తున్నానని, ఫలితం ఏదైనా తన భుజాల మీద మోస్తానని ట్రంప్ స్పష్టం చేశారు.
ఇరాన్ వాదన..
కాగా, తాము అణు ఆయుధాలను తయారు చేయడం లేదని, శాంతియుత అవసరాల కోసమే అణు కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని ఇరాన్ మొదటి నుంచీ వాదిస్తోంది. అయితే, ఇరాన్ అణు ముప్పును అడ్డుకోవడం మిత్రదేశాల ప్రయోజనాలకు కూడా అవసరమని ట్రంప్ పేర్కొన్నారు.






