బీజేపీతో కాంగ్రెస్ పొత్తు.. కఠిన నిర్ణయం తీసుకున్న అధిష్టానం

by Malleboina Mahesh |

మహారాష్ట్రలోని అంబర్‌నాథ్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో మొత్తం 60 సీట్లకు గాను ఏక్‌నాథ్ షిండే వర్గం శివసేన 27 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది.

బీజేపీతో కాంగ్రెస్ పొత్తు.. కఠిన నిర్ణయం తీసుకున్న అధిష్టానం
X

దిశ, వెబ్ డెస్క్: బద్ధ శత్రువులైన బీజేపీ- కాంగ్రెస్ పార్టీలు చేతులు కలిపాయి సంచలనంగా మారింది. ఇటీవల జరిగిన మహారాష్ట్రలోని అంబర్‌నాథ్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో మొత్తం 60 సీట్లకు గాను ఏక్‌నాథ్ షిండే వర్గం శివసేన 27 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే మ్యాజిక్ ఫిగర్ (మెజారిటీ) సాధించలేకపోయింది. శివసేనను అధికారానికి దూరంగా ఉంచాలనే లక్ష్యంతో 14 సీట్లు గెలిచిన బీజేపీ, 12 సీట్లు గెలిచిన కాంగ్రెస్, 4 సీట్లు గెలిచిన ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) ఒక్కటై 'అంబర్‌నాథ్ వికాస్ అఘాడి'గా ఏర్పడ్డాయి. ఈ కూటమి మద్దతుతో బీజేపీ అభ్యర్థి తేజశ్రీ కరంజులే పాటిల్ కౌన్సిల్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ కఠిన నిర్ణయం తీసుకుంది.

బీజేపీతో పొత్తే కారణం - పార్టీ నుంచి ప్రదీప్ పాటిల్ సస్పెండ్

అంబర్‌నాథ్ మున్సిపల్ కౌన్సిల్‌లో పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్న కారణంతో కాంగ్రెస్ పార్టీ కఠిన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కార్యాలయానికి కనీస సమాచారం ఇవ్వకుండా, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సభ్యులతో పొత్తు పెట్టుకున్నారన్న ఆరోపణలపై అంబర్‌నాథ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రదీప్ పాటిల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. రాజకీయంగా బద్ధ శత్రువులైన బీజేపీతో చేతులు కలపడాన్ని పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది.

పూర్తి కమిటీ రద్దు, కార్పొరేటర్లపై చర్యలు

ఈ వ్యవహారంలో కేవలం అధ్యక్షుడిపైనే కాకుండా, మొత్తం వ్యవస్థపైనే చర్యలు చేపట్టింది. బ్లాక్ కాంగ్రెస్ కార్యవర్గ కమిటీని తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి, నిబంధనలకు విరుద్ధంగా నడుచుకున్న కార్పొరేటర్లు అందరినీ కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించింది. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేసే వారిని ఉపేక్షించేది లేదని ఈ చర్య ద్వారా కాంగ్రెస్ స్పష్టం చేసింది.

Next Story